PM Modi on Sanatana Dharma :సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఇండియా కూటమి నేతలు అనుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. స్వామి వివేకానంద, లోకమాన్య బాలగంగాధర్ తిలక్‌లకు స్ఫూర్తినిచ్చిన సనాతన ధర్మానికి వ్యతిరేకంగా.. బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మధ్యప్రదేశ్‌లో బినాలో బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ.. అహంకారపూరిత ఇండియా కూటమిని అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
"'ఇండి' కూటమికి రహస్య అజెండా ఉంది. వారికి సరైన నాయకులు లేరు. భారత సంస్కృతిపై దాడి చేసేందుకు నిర్ణయించుకున్నారు. సనాతన సంస్కృతిని అంతం చేయాలని తీర్మానించుకున్నారు. ఈరోజు బహిరంగంగానే సనాతన ధర్మాన్నిలక్ష్యంగా చేసుకొని మాట్లాడుతున్నారు. రేపు మనపై దాడులు కూడా పెంచుతారు. దేశవ్యాప్తంగా ఉన్న సనాతనీలు అందరూ, దేశాన్ని ప్రేమించేవారంతా అప్రమత్తంగా ఉండాలి. అలాంటి వ్యక్తులను మనం అడ్డుకోవాలి" అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఓ పక్క ప్రపంచాన్ని ఏకం చేసే సామర్థ్యాన్ని 'న్యూ భారత్' ప్రదర్శిస్తుంటే.. మరో పక్క దేశంలో విభజన సృష్టించేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
జీ20 విజయవంతం కావడానికి దేశ ప్రజలే కారణమన్నారు మోదీ. ఈ ఘనత వారికే చెందుతుందని పేర్కొన్నారు. ఇది 140 కోట్ల మంది విజయమని.. అది దేశానికి, ప్రజలకు ఎంతో గర్వకారణమని వ్యాఖ్యానించారు. చాలా కాలం పాటు మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రానికి ఏం చేయలేదని మోదీ విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో నేరాలు, అవినీతి మాత్రమే జరిగిందని ఆరోపించారు. ఇతర రాష్ట్రాలంతో పోలిస్తే.. మధ్యప్రదేశ్‌ను కాంగ్రెస్ వెనకబాటుకు గురిచేసిందని ధ్వజమెత్తారు.
గురువారం మధ్యప్రదేశ్‌లో పర్యటించిన మోదీ.. కొత్తగా 75లక్షల గ్యాస్ కలెక్షన్లను దేశ ప్రజలకు అందించనున్నట్లు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రకటించారు. దాంతోపాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తనను ఇక్కడికి ఆహ్వానించి, రాష్ట్ర ప్రజలను కలిసే అవకాశం కల్పించినందుకు.. తన ప్రసంగ సమయంలో ఆనందం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లో మొత్తం 50,700 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మోదీ. పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌తో పాటు మరో పది పారిశ్రామిక ప్రాజెక్టులకు స్వీకారం చుట్టారు.