PM Modi on Parliament Security Breach :పార్లమెంటులో భద్రతా వైఫల్యం ఘటన దురదృష్టకరమని, దాన్ని ఏమాత్రం తక్కువగా అంచనా వేయకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ ఘటనపై అనవసరపు రాద్ధాంతం చేయవద్దని ప్రతిపక్షాలను కోరారు. హిందీ దినపత్రిక దైనిక్ జాగరణ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా సమస్య లోతుల్లోకి వెళ్లి పరిష్కారం కనుగొనాలని ప్రధాని వ్యాఖ్యానించారు. ఘటన అనంతరం స్పీకర్ ఓం బిర్లా విచారణకు ఆదేశించారని, దర్యాప్తుపై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు సంస్థలు విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటున్నాయని, దీని వెనుక ఉన్న వ్యక్తుల మూలాలను, వారి ఉద్దేశాలను తెలుసుకోవడం కూడా అంతే అవసరమని మోదీ అన్నారు. సమష్టి స్ఫూర్తితో ఇలాంటి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వీటిపై గొడవలు మానుకోవాలి విపక్షాలకు ప్రధాని హితవు పలికారు.
Parliament Attack 2023
డిసెంబర్ 13న పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం ఘటనపై విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే ఉభయ సభలకు చెందిన 14 మంది విపక్ష ఎంపీలను బహిష్కరించారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై తాజాగా మోదీ స్పందించారు.
'ఎంతో కాలం ప్రజాసేవ చేసినవారే'
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ సీఎంలుగా కొత్త వారిని ఎంపిక చేయడంపై కూడా ప్రధాని స్పందించారు. ఈ మూడు రాష్ట్రాల సీఎంలు కొత్తవారని చాలా మంది భావిస్తున్నారని, నిజానికి, వారు కొత్తవాళ్లేం కాదని ఎంతో కాలం ప్రజల కోసం కష్టపడ్డారని అన్నారు. వారికి ఎంతో అనుభవం ఉందన్నారు. చాలా కాలంగా మీడియా దృష్టి కొన్ని కుటుంబాలపైనే ఉండిపోయిందని, కష్టపడి పనిచేసే వారి గురించి పెద్దగా ఎవరికీ తెలియలేదని తెలిపారు. ఇలాంటివి ప్రతి రంగంలోనూ జరుగుతాయని పేర్కొన్నారు.
'విపక్షాలు ఆత్మపరిశీలన చేసుకోవాలి'
ఆర్టికల్ 370 రద్దు సరైనదేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపైనా మోదీ మాట్లాడారు. తాము తీసుకున్న నిర్ణయం సరైనదేనని సుప్రీంకోర్టు స్టాంప్ వేసిందని, విశ్వంలో ఏ శక్తి కూడా మళ్లీ ఆర్టికల్ 370ని తీసుకురాలేదని మోదీ వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాజపా మరోసారి చరిత్రాత్మక విజయం దక్కించుకుంటుందని ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని మోదీ అన్నారు. విపక్షాలు చెప్పిన మాటలను ప్రజలు ఎందుకు నమ్మడం లేదో వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు.
'మేం ప్రశ్నలు డిమాండ్ చేస్తూనే ఉంటాం'
మరోవైపు, భద్రతా ఉల్లంఘన ఘటనపై పార్లమెంట్‌లో చర్చ నుంచి ప్రధాని మోదీ పారిపోతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. నిందితులకు ఎంట్రీ పాస్‌లు ఇచ్చిన బీజేపీ ఎంపీ పాత్రపై ప్రశ్నలు లేవనెత్తుతామన్న ఆందోళనతోనే చర్చను చేపట్టడం లేదని పేర్కొంది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. మోదీ ఇప్పటికైనా తన మౌనాన్ని వీడారంటూ ఎద్దేవా చేశారు. డిసెంబర్ 13న జరిగిన ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని ఇండియా కూటమి పార్టీలన్నీ డిమాండ్ చేస్తూనే ఉంటాయని జైరాం రమేశ్ స్పష్టం చేశారు.
కాల్చేసిన ఫోన్లు స్వాధీనం
Parliament Security Breach Accused :మరోవైపు..పార్లమెంట్‌లో అలజడి రేపిన ఘటనలో దర్యాప్తు వేగవంతమైంది. సాగర్ శర్మ, మనోరంజన్, అమోల్ శిందే, నీలం దేవి, ప్రధాన నిందితుడు లలిత్ ఝాను పోలీసు ప్రత్యేక విభాగం కౌంటర్ ఇంటలిజెన్స్ విచారిస్తోంది. ఈ విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడు లలిత్ ఝా నలుగురు నిందితుల ఫోన్లను దహనం చేసిన స్థలాన్ని పోలీసులు గుర్తించారు. ప్రధాన సూత్రధారి లలిత్‌ను రాజస్థాన్‌లో అతడు తలదాచుకున్న నగౌర్‌కు తీసుకెళ్లి విచారించారు. అక్కడ తనతోపాటు సన్నిహితుల సెల్ ఫోన్లను ధ్వంసం చేశానని లలిత్ చెప్పిన ప్రదేశంలో ఆధారాలు సేకరించారు. అక్కడ కాలిపోయి శిథిలావస్థలో ఉన్న సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల బట్టలు కాల్చి వేసిన ప్రదేశాన్ని కూడా పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా నిందితులను ఆయా ప్రాంతాలకు తీసుకువెళ్లి విచారణ చేపట్టారు.
విచారణలో భాగంగా వారు ఆశ్రయం పొందిన, కుట్ర పన్నిన ప్రాంతాలకు నిందితులను తీసుకెళ్లి విచారించి ఆధారాలు సేకరించారు. లోక్‌సభ పాస్‌లు సిఫార్సు చేసిన భాజపా ఎంపీ ప్రతాప్ సింహా స్టేట్‌మెంట్‌ను కూడా నమోదు చేయాలని భావిస్తున్నారు. లోక్‌సభ స్పీకర్ అనుమతితో సీన్ రీ కన్‌స్ట్రక్ట్ చేసే ఆలోచనలో కూడా పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది. లలిత్‌కు సహకరించిన మహేశ్ కుమావత్, కైలాశ్‌లకు క్లీన్‌చిట్ ఇవ్వలేదని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలని భావించినట్లు లలిత్ ఝావిచారణ సందర్భంగా తెలిపినట్లు తెలుస్తోంది. లలిత్ ఝా తన ఫోన్‌ను దిల్లీ-జైపూర్ సరిహద్దులో విసిరివేసినట్లు అంగీకరించాడు. ఈ కుట్ర ప్రణాళికను అమలు చేయడానికి ముందు దిల్లీలో అనేకమార్లు కలిసినట్లు లలిత్ ఝా చెప్పాడు.
'ఒంటికి నిప్పంటించుకోవాలని నిందితుల ప్లాన్'- పార్లమెంట్ ఘటనలో విస్తుపోయే నిజాలు
''లోక్‌సభ ఘటన' వెనుక పెద్ద వ్యక్తులు, వారంతా తప్పించుకున్నారు!- తప్పు చేస్తే ఉరితీయండి!!'