PM Modi On Congress Corruption in Chhattisgarh :కాంగ్రెస్ పార్టీ మద్యంలోనూ అవినీతికి పాల్పడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీధ్వజమెత్తారు. చివరకు ఆవుపేడను సైతం వదల్లేదని మండిపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఛత్తీస్‌గఢ్ అవినీతిలో మునిగిపోయిందని, కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ప్రతి పథకంలోనూ స్కామ్ ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. పబ్లిక్ సర్వీస్ స్కామ్‌లో దోషులుగా తేలినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మోదీ స్పష్టం చేశారు. గరీబ్ కల్యాణ్ యోజన కింద ఇచ్చే రేషన్‌లోనూ ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ సర్కారు అవినీతికి పాల్పడిందని అన్నారు.
"పేదలకు కాంగ్రెస్ చేసినంత అన్యాయం ఎవరూ చేయలేదు. కొవిడ్ సమయంలో అందరికీ రేషన్ ఇవ్వాలని నేను నిర్ణయం తీసుకున్నా. కానీ, ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ప్రభుత్వం అందులోనూ అవినీతికి పాల్పడింది. అందులోనూ కుంభకోణం చేసింది. కాంగ్రెస్ హయాంలో రైల్వేలకు రూ.300 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది రూ.6000 కోట్లు కేటాయించాం. ఇది 'మోదీ మోడల్'. ఇది ఛత్తీస్‌గఢ్ అభివృద్ధి కోసం నేను కట్టుబడి ఉండటాన్ని సూచిస్తుంది. ఛత్తీస్‌గఢ్‌కు వందేభారత్ రైళ్లను కేటాయించింది కూడా బీజేపీనే."
-ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
PM Modi In Chhattisgarh :కాంగ్రెస్ పార్టీ కులాల పేరుతో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. మోదీని లక్ష్యంగా చేసుకొని ఓబీసీలను అవమానిస్తోందని మండిపడ్డారు. దళితులు, ఎస్టీలు, ఓబీసీల ఎదుగుదలను చూసి కాంగ్రెస్ ఓర్వలేకపోతోందని అన్నారు. బీజేపీ హయాంలోనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఆమోదం పొందిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు గత్యంతరం లేకే మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతిచ్చాయని అన్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహంతో ఉందని, దీంతో కొత్త గిమ్మిక్కులు తెరపైకి తీసుకొచ్చారని చెప్పుకొచ్చారు.