PM Modi On Bhupesh Baghel Today : మహాదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్‌పై ఎదురుదాడి చేశారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. నిందితులతో ఉన్న సంబంధం ఏమిటో బఘేల్ చెప్పాలని ప్రధాని డిమాండ్ చేశారు. దుర్గ్ జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ.. ప్రజలను దోచుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టడం లేదన్నారు. కాంగ్రెస్ నేతలు చివరికీ దేవుళ్లను కూడా వదలడం లేదంటూ పరోక్షంగా మహాదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం వ్యవహారాన్ని ప్రస్తావించారు.
"ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మిమ్మల్ని దోచుకునేందుకు ఏ ఒక్క అవకాశం వదలడం లేదు. వారు మహాదేవ్ పేరు కూడా వదిలిపెట్టడం లేదు. రెండు రోజులక్రితం రాయ్‌పుర్‌లో పెద్దమొత్తంలో నగదు పట్టుబడింది. ఈ డబ్బు జూదం ఆడేవారిది. వారు ఛత్తీస్‌గఢ్‌లోని పేదలను దోచుకోవటం ద్వారా ఈ డబ్బు కూడగట్టారు. ఈ డబ్బులతో కాంగ్రెస్ నేతలు తమ ఇళ్లను నింపుకుంటున్నారు. ఈ డబ్బుల లింక్ ఛత్తీస్‌గఢ్‌లోని వారి వద్దకు వెళ్తోంది. ఇక్కడి ముఖ్యమంత్రి ఛత్తీస్‌గఢ్ ప్రజలకు చెప్పాలి. దుబాయ్‌లో ఉన్న ఈ కుంభకోణం సూత్రధారులతో ఏం సంబంధమో చెప్పాలి."
--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
Modi on Congress Chhattisgarh Today : తన దృష్టిలో దేశంలో అతిపెద్ద సామాజిక వర్గం అంటే పేదరికమే అని.. తాను వారికి సేవకుడినని ప్రధాని మోదీ చెప్పారు. పేదలను విభజించేందుకు కొన్ని రాజకీయ పార్టీలు కొత్త కుట్రలు పన్నుతున్నాయని, కులతత్వ విషాన్ని వ్యాపింపజేస్తున్నాయని విమర్శించారు. ఓబీసీ ప్రధాన మంత్రిని, ఆ వర్గం మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ దూషిస్తోందని.. అయితే వీటికి తాను భయపడనని అన్నారు. పేదల అభివృద్ధిని కాంగ్రెస్ కోరుకోవడం లేదని దుయ్యబట్టారు. 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ పథకాన్ని వచ్చే ఐదేళ్లపాటు పొడిగిస్తామని ప్రకటించారు.
మోదీకి దుబాయ్‌తో సంబంధమేంటీ? ప్రధాని వ్యాఖ్యలపై బఘేల్ కౌంటర్
మరోవైపు ప్రధాని మోదీ వ్యాఖ్యలపై స్పందించారు ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్. తనకు దుబాయ్‌తో ఉన్న సంబంధాలపై మోదీ ప్రశ్నలు అడిగారని.. అయితే, తాను కూడా మోదీని అదే ప్రశ్న అడుగుతున్నానని చెప్పారు. మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ను ఎందుకు మూసివేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యతని తెలిపారు. అంతకుముందు ఈడీ ఆరోపణలపై మీడియాతో మాట్లాడిన బఘేల్.. ఇంతకంటే పెద్ద జోక్ ఉండదని అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ రాజ్యాంగ సంస్థలను ఉపయోగించుకుని పోటీ చేయాలని అనుకుంటోందని ఎద్దేవా చేశారు. తాము కూడా ఎవరో ఒకర్ని పట్టుకుని ఆ పట్టుకున్న వ్యక్తి ప్రధాని మోదీ పేరు చెప్తే.. ఆయనను విచారిస్తారా అని బఘేల్ ప్రశ్నించారు. ఒకరి ప్రతిష్టను నాశనం చేయడం చాలా సులభమని అన్నారు.