PM Modi on Andhra Pradesh Telangana Division :ఆంధ్రప్రదేశ్ విభజన సరిగ్గా జరగలేదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. తెలంగాణ ఏర్పాటు ఎంతో ప్రయాసతో జరిగిందన్నారు. రాష్ట్ర విభజన ఇటు ఆంధ్ర, అటు తెలంగాణ ప్రజలను సంతృప్తిపరచలేకపోయిందని అభిప్రాయపడ్డారు. కొత్త రాష్ట్రం వచ్చినా తెలంగాణ సంబరాలు చేసుకోలేకపోయిందని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా సోమవారం లోక్సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లా ఏపీ విభజన జరగలేదన్నారు.
మాజీ ప్రధానుల సేవలను పేరుపేరునా కొనియాడిన మోదీ.. సభలో జరిగిన చర్చలు, మైలురాళ్ల లాంటి నిర్ణయాలను గుర్తుచేసుకున్నారు. నలుగురు సభ్యులున్న పార్టీలు కూడా అధికారంలో భాగస్వామ్యం పొందాయన్నారు. దేశంలో ఒక్క ఓటుతో అధికారం కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయని మోదీ గుర్తు చేశారు. రాజకీయాలను విరమించుకుని సన్యాసం తీసుకోవాలనుకున్న పీవీ నరసింహారావు ప్రధాన మంత్రిగా దేశానికి కొత్త దిశానిర్దేశం చేశారని కొనియాడారు నరేంద్ర మోదీ. 'ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి.. ఈ దేశం శాశ్వతం' అన్న వాజ్‌పేయీ మాటలు నిరంతరం తన మననంలోకి వస్తుంటాయని వ్యాఖ్యానించారు. స్ట్రోక్ ఆఫ్ ద మిడ్‌నైట్ అన్న పండిట్ నెహ్రూ స్వరం మన చెవుల్లో నిరంతరం గింగిర్లు తిరుగుతుంటుందన్నారు ప్రధాని.
"ఈ సభకు 17 మంది స్పీకర్లు నేతృత్వం వహించారు. మౌలంకర్ నుంచి సుమిత్రా మహాజన్ వరకు ఈ సభకు దిశానిర్దేశం చేశారు. ఈ సభలో సభ్యులే కాదు.. వారికి సహకరించిన సిబ్బంది భాగస్వామ్యం కూడా ఎన్నదగినది. పార్లమెంటుపై జరిగిన ఉగ్రదాడి భవనంపై జరిగింది కాదు.. భారతీయ జీవాత్మపై జరిగిన దాడి." అని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. సభ్యులను రక్షించడంలో ప్రాణాలు కోల్పోయిన వీరజవాన్ల సాహసం జాతి ఉన్నంతకాలం గుర్తుంటుందని అన్నారు.