PM Modi Nagpur Visit : మహారాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. దేశంలో ఆరో వందే భారత్ రైలుకు శ్రీకారం చుట్టారు. నాగ్‌పుర్ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్ మధ్య సేవలందించే ఈ రైలును నాగ్‌పుర్ రైల్వేస్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించారు. మరోవైపు.. రూ.590 కోట్లతో నాగ్‌పుర్, రూ.360 కోట్లతో అజ్ని రైల్వేస్టేషన్ల అభివృద్ధి పనులకు పునాది రాయి వేశారు. వీటితో పాటు మరిన్ని ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ.
'గతంలో పన్ను చెల్లింపుదారుల సొమ్ము.. అవినీతి, ఓటుబ్యాంకు రాజకీయాలతో వృథా అయ్యేది. గత ఎనిమిదేళ్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేశాం. షార్ట్‌కట్ రాజకీయాలతో దేశాభివృద్ధి జరగదు. దేశానికి షార్ట్‌కట్ రాజకీయాలు అవసరం లేదు. కొన్ని రాజకీయ పార్టీలు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. తప్పుడు వాగ్దానాలతో అధికారాన్ని చేజిక్కించుకోవడం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
--ప్రధాని నరేంద్ర మోదీ
జెండా ఊపి వందేభారత్ రైలును ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ బటన్ నొక్కి వందేభారత్ రైలును ప్రారంభిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో భాగంగానే రూ.8,650 కోట్లతో నిర్మించిన నాగ్‌పుర్ మెట్రో ఫేజ‌్-1ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం సాధారణ ప్రయాణికుడిలా టికెట్ కొనుగోలు చేసి.. ఫ్రీడంపార్క్ స్టేషన్ నుంచి ఖప్రీ స్టేషన్ వరకు మెట్రోలో ప్రయాణించారు. మెట్రో ప్రయాణంలో విద్యార్థులు, ప్రయాణికులతో ముచ్చటించారు. అనంతరం రూ.6,700 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మెట్రో ఫేజ్-2కు శంకుస్థాపన చేశారు.
మెట్రోలో ప్రయాణిస్తున్న ప్రధాని మోదీ అనంతరం నాగ్‌పుర్‌లో నిర్మించిన ఆల్ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)ను మోదీ ప్రారంభించారు. కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్, కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, రావ్‌సాహెబ్ ధన్వే పాల్గొన్నారు. రూ.1,575 కోట్లతో 2017లో నాగ్‌పుర్ ఎయిమ్స్‌కు శంకుస్థాపన చేసిన ప్రధాని.. ఆదివారం దాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా కళాకారులతో కలిసి సంగీత వాయిద్యాలు వాయించి అలరించారు.
శంకుస్థాపన చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ కళాకారులతో కలిసి డప్పు వాయిస్తున్న మోదీ