తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేంద్ర మంత్రివర్గంలో మార్పులు! - ప్రధానిని కలిసిన షా

కేంద్ర మంత్రివర్గంలో మార్పులు జరగనున్నాయన్న ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ప్రధాని మోదీతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

BJP
మోదీ, షా, నడ్డా

By

Published : Jun 12, 2021, 7:10 AM IST

కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందన్న ఊహాగానాలు రాజధానిలో జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డాలతో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకొంది. 2019 మే నెలలో రెండోసారి ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇంతవరకు మంత్రివర్గంలో మార్పులు జరగకపోవడం గమనార్హం. కేంద్రమంత్రి మండలిలో మొత్తం 79 మందిని తీసుకోవడానికి వెసులుబాటు ఉంది. ప్రస్తుతం రెండు డజన్లకుపైగా ఖాళీలు ఉన్నాయి. ఎన్నికలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని మంత్రివర్గంలో తగిన మార్పులు చేసే సూచనలు ఉన్నాయి.

షా, నడ్డాతో ప్రధాని భేటీ

మరోవైపు గురువారం నుంచి వివిధ మంత్రుల పనితీరును ప్రధాని సమీక్షిస్తుండడం ప్రాధాన్యం సంతరించుకొంది. తొలి రోజున సాయంత్రం అయిదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు పలు శాఖల ప్రగతిపై ఆరా తీశారు. ఈ సమీక్షల్లో భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బి.ఎల్‌.సంతోష్‌ కూడా పాల్గొంటున్నారు. కేబినెట్‌ మంత్రులు, సహాయ మంత్రులు ప్రధాని నివాసానికి వచ్చి గత రెండేళ్లలో తమ శాఖల వారీగా సాధించిన ప్రగతిని వివరిస్తున్నారు. ఇంతవరకు మూడు సమావేశాలు జరిగాయి. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పశుపోషణ, మత్స్య, గిరిజనాభివృద్ధి, పట్టణాభివృద్ధి, సాంస్కృతిక వ్యవహారాలు, గణాంకాలు-పథకాల అమలు, పౌర విమానయానం, రైల్వేలు, ఆహారం, వినియోగదారుల వ్యవహారాలు, జల్‌శక్తి, పెట్రోలియం, ఉక్కు, పర్యావరణం శాఖలపై సమీక్షలు జరిపారు. మరికొన్ని రోజుల పాటు ఇవి కొనసాగనున్నాయి
జితిన్‌ ప్రసాదకు పదవి?
కాంగ్రెస్‌ నుంచి భాజపాలో చేరిన జితిన్‌ ప్రసాదకు కూడా యూపీ మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం దిల్లీ పర్యటనలో ఉన్న యోగిని జితిన్‌ కలుసుకున్నారు కూడా. గురువారం అమిత్‌ షాతో సమావేశం ముగించుకొని వచ్చిన యోగి వద్దకు జితిన్‌ వెళ్లడం విశేషం. బ్రాహ్మణ వర్గాన్ని ఆకర్షించాలన్న ఉద్దేశంతో ఆయనకు పదవిని కట్టబెట్టవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.

ప్రధానితో యోగి సమావేశం

మోదీని కలిసిన యోగి ఆదిత్యనాథ్

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఉత్తర్‌ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆధ్వర్యంలోని మంత్రివర్గంలో కూడా మార్పులు జరుగుతాయన్న ప్రచారం జరుగుతోంది. ఆ రాష్ట్రంలో మిత్రపక్షమైన అప్నాదళ్‌కు చెందిన అనుప్రియా పటేల్‌తో అమిత్‌ షా చర్చలు జరపడాన్ని కూడా ముఖ్య విషయంగా చెప్పుకొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీతో శుక్రవారం యోగి ఆదిత్యనాథ్‌ సమావేశమయ్యారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం దిల్లీ వచ్చిన ఆయన గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయి తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడం, కొవిడ్‌ నియంత్రణలో యోగి ప్రభుత్వం విఫలమయిందన్న విమర్శలు రావడంతో మంత్రివర్గంలో మార్పులు చేయాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది.

ఇదీ చదవండి:

ప్రధానితో యూపీ సీఎం యోగి భేటీ

భాజపాలో చేరిన కాంగ్రెస్ కీలక నేత

ABOUT THE AUTHOR

...view details