భారత పర్యటనలో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్.. ప్రధాని నరేంద్ర మోదీతో బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రాంతీయ భద్రత, క్వాడ్, కొవిడ్, పర్యావరణ పరిరక్షణ మొదలైన అంశాలపై మోదీ, బ్లింకెన్ చర్చించుకున్నారు. వివిధ రంగాల్లో ఇరు దేశాల బంధం బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ పేర్కొన్నారు.
ఇరు దేశాల భాగస్వామ్యం కీలకం..
కరోనా మహమ్మారి, వాతావరణ మార్పుల నేపథ్యంలో భవిష్యత్తులో భారత్ అమెరికా భాగస్వామ్యం ప్రపంచానికి కీలకంగా మారనుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇరు దేశాలు సమాజంలోని స్వేచ్ఛ, ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నాయన్నారు. ఇరు దేశాల బంధం బలోపేతం కావటంలో భారత సంతతి అమెరికన్లు కీలక పాత్ర పోషించారని తెలిపారు. క్వాడ్, కొవిడ్, వాతావరణ మార్పులకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను ప్రధాని ప్రశంసించారు.
అంతకుముందు బ్లింకెన్.. విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్లతో భేటీ అయ్యారు.
ఇదీ చదవండి :'కరోనాపై పోరుకు భారత్, అమెరికా నాయకత్వం'