PM Modi Meeting on covid-19 situation: దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. ఈ వేరియంట్ కేసులు 250కి చేరువైన నేపథ్యంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. అయితే.. గురువారం దేశవ్యాప్తంగా కొవిడ్-19 పరిస్థితిపై సమీక్షించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ మేరకు మోదీ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
దేశంలో బుధవారం నాటికి 213 మందికి ఒమిక్రాన్ సోకినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 15 రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసినట్లు పేర్కొంది.
బూస్టర్ డోసు కావాలంటూ..
రెండు డోసుల కొవిడ్ టీకా తీసుకున్నవారు బూస్టర్ డోసు తీసుకునేలా ప్రభుత్వం అనుమతించాలని పలుచోట్ల డిమాండ్ వ్యక్తమవుతోంది. చాలా దేశాల్లో బూస్టర్ డోసు పంపిణీ జరుగుతోందని కొందరు చెబుతున్నారు. భారత్ కూడా అదే దిశగా వెళ్లాలని ఆశిస్తున్నారు.