PM Modi Mann Ki Baat Today : దేశవ్యాప్తంగా అమరవీరుల గౌరవార్థం వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 'మేరీ మాటి మేరా దేశ్' పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. 103వ మన్ కీ బాత్‌లో ప్రసంగించిన ప్రధాని మోదీ.. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వారిని గౌరవించుకునేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
"అమరవీరులకు గౌరవ సూచకంగా దేశవ్యాప్తంగా పలు గ్రామాల్లో ప్రత్యేక శాసనాలను ఏర్పాటు చేస్తాం. దాంతోపాటు అమృత్ కలశ యాత్ర పేరుతో దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి 7,500 కలశాల్లో మట్టి, మొక్కలను సేకరిస్తాం. వాటన్నింటినీ దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక స్తూపం పక్కనే అమృత్ వాటిక పేరుతో ప్రత్యేక స్తూపాన్ని నిర్మించనున్నాం. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్‌కు ప్రతీకగా ఈ అమృత్ వాటిక నిలుస్తుంది"
-- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
Narendra Modi Mann Ki Baat : స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ తమ ఇంటిపైన జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని ప్రధాని మోదీ కోరారు. దీని ద్వారా మన కర్తవ్యంతో పాటు దేశం కోసం ఎంతో మంది చేసిన త్యాగాలు గుర్తుకు వస్తాయని అన్నారు. 12 వేల కోట్ల విలువైన 10 లక్షల కిలోల మాదకద్రవ్యాలను ధ్వంసం చేసి భారత్ రికార్డు నెలకొల్పిందని మోదీ తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒక్క రోజులో 30 కోట్ల మొక్కలను నాటడం ప్రజల భాగస్వామ్యం, అవగాహనకు నిదర్శమని వ్యాఖ్యానించారు.
"రెండు వారాల క్రితం మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా భారత్ పెద్ద దర్యాప్తు చేపట్టింది. లక్షా 50 వేల కిలోల డ్రగ్స్‌ను ధ్వంసం చేసింది. 12 వేల కోట్ల విలువైన 10 లక్షల కిలోల మాదకద్రవ్యాలను ధ్వంసం చేసి భారత్ రికార్డు సృష్టించింది. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న వారందరినీ నేను అభినందిస్తున్నాను. మాదకద్రవ్యాలకు బానిస కావడం కుటుంబానికే కాకుండా యావత్తు సమాజానికే పెద్ద సమస్య."
-- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
'ప్రపంచ నలుమూలల నుంచి టారిస్ట్లు వస్తున్నారు..'
"విపత్తుల వల్ల గత కొంతకాలంగా దేశంలో ఆందోళన నెలకొంది. యమునా నది వరదల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు కొండప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. విపత్తు సమయంలో సహాయక చర్యలు చేపట్టిన బృందాలకు ధన్యవాదాలు. ప్రస్తుతం శ్రావణ మాసం కొనసాగుతోంది. ఈ మాసంలో పచ్చదనం, ఉల్లాసవంతంగా ఉంటుంది. యాత్రా స్థలాలకు ప్రపంచ నలుమూలల నుంచి వస్తున్నారు. కాలిఫోర్నియా నుంచి అమర్‌నాథ్‌కు ఇద్దరు యాత్రికులు వచ్చారు" అని తెలిపారు.
'100కుపైగా అతిపురాతన కళాఖండాలు..'
ఇటీవల ఫ్రాన్స్‌లో వందేళ్ల మహిళా యోగా గురువును కలిశానని మోదీ తెలిపారు. ఆ మహిళా యోగా గురువు 40 ఏళ్లుగా యోగా చేస్తున్నారని.. వృద్ధురాలి ఆరోగ్యం, దీర్ఘాయువుకు యోగా ఉపకరించిందని చెప్పారు. అమెరికాయ.. 250 నుంచి 2500 ఏళ్ల నాటి 100కుపైగా అతిపురాతన కళాఖండాలను భారత్‌కు తిరిగి ఇచ్చిందని మోదీ వెల్లడించారు. కళాఖండాలు ఇచ్చిన అమెరికా ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.