PM Modi Mann Ki Baat: భారత దేశ ఎగుమతులు 400 బిలియన్ డాలర్లు దాటాయని, దేశీయ వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోందని చెప్పేందుకు ఇది నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రతి భారతీయుడు 'ఓకల్ ఫర్ లోకల్'కు ప్రాధాన్యమిస్తే.. ఈ స్థానిక ఉత్పత్తులే ప్రపంచవ్యాప్తమవుతాయని అన్నారు. మన్‌కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడిన మోదీ... ఎగుమతుల ద్వారా భారత దేశ సత్తాను ప్రపంచానికి చాటినట్లైందని చెప్పారు.
"రైతులు, ఇంజినీర్లు, చిరు వ్యాపారులు, ఎంఎస్ఎంఈ రంగాలు, కళాకారులు దేశం పటిష్ఠంగా మారడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరి శ్రమ, కృషి వల్లే దేశం 400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించింది. ఇదేదో ఆర్థికపరమైన విషయం కాదు. ఇది భారత శక్తిసామర్థ్యాలకు సంబంధించిన విషయం. దేశ ప్రజల శక్తిసామర్థ్యాలు.. ప్రపంచంలోని అన్ని దిశలకు వ్యాపిస్తున్నాయి. మన లోకల్‌ను గ్లోబల్‌గా మార్చుదాం. దేశీయ ఉత్పత్తులకు ఉన్న ప్రతిష్ఠను మరింత పెంచుదాం. భారత్‌లో తయారైన ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోందంటే.. దేశీయ సప్లై చైన్ రోజురోజుకూ బలంగా తయారవుతోందని అర్థం."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి