Mann Ki Baat 100 Episode : ప్రధానమంత్రిగా 2014లో అధికారం చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ.. దేశ ప్రజలతో తన మనసులోని మాటలను నేరుగా పంచుకునే మన్‌కీబాత్ కార్యక్రమం వందో ఎపిసోడ్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేశారు. మన్‌కీ బాత్ కేవలం ఒక కార్యక్రమం కాదని.. తనకు విశ్వాసం ఇచ్చిన వేదికని మోదీ అన్నారు. ప్రజలతో ఎలా అనుసంధానం అవ్వాలి అనే ప్రశ్నకు మన్‌కీ బాత్ సమాధానం ఇచ్చిందని ఆయన వివరించారు.
"2014లో విజయదశమి రోజున మన్‌కీ బాత్ కార్యక్రమం మొదలుపెట్టాం. దేశ నలుమూలల ప్రజలు కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మన్‌కీ బాత్‌లో చర్చించాం. సామాన్యుల సమస్యల పరిష్కారానికి వేదికగా మారింది. సామాన్యులతో అనుసంధానానికి ఈ కార్యక్రమం వేదికైంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోని భావోద్వేగాలను తెలుసుకోగలిగాను. నా ఆలోచనలను ప్రజలతో పంచుకున్నాను. సామాన్యులకు సంబంధించి ప్రతినెలా కొన్ని వేల సందేశాలు చదివాను. మన్‌కీ బాత్ కార్యక్రమం ప్రజలను మరింత చేరువ చేసింది. అసామాన్య సేవలందించిన వ్యక్తుల గురించి తెలుసుకోగలిగాను.అసామాన్య సేవలందిస్తున్న ప్రజలతో మాట్లాడే అవకాశం లభించింది."
-- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
దేశంలో మన్ కీ బాత్ కార్యక్రమం సానుకూల దృక్పథాన్ని పెంచిందని ప్రజలందరూ జరుపుకునే పండుగలా మారిందని మోదీ అన్నారు. ప్రధానమంత్రిగా 2014లో అధికారం చేపట్టిన నాటి నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని మోదీ తెలిపారు. సామాన్యులకు సంబంధించి ప్రతినెలా కొన్ని వేల సందేశాలు మన్ కీ బాత్‌లో చదివానన్న మోదీ ఈ కార్యక్రమం తనను ప్రజలకు మరింత చేరువ చేసిందన్నారు. అసామాన్య సేవలు అందించిన వ్యక్తుల గురించి తెలుసుకునే అవకాశం.. మన్ కీ బాత్ ద్వారా లభించిందని హర్షం వ్యక్తం చేశారు. చెట్లు నాటడం, పేదలకు వైద్యం అందించడం, ప్రకృతి రక్షణకు నడుం బిగించడం వంటి కార్యక్రమాలు తనలో ప్రేరణ నింపాయని పేర్కొన్నారు. మన్ కీ బాత్ కోట్లాది మంది భారతీయుల ప్రతిబింబమని వారి భావాల వ్యక్తీకరణ అని ప్రధాని అభిప్రాయపడ్డారు. దేశంలో సామూహిక ఉద్యమాలు ఊపందుకోవడంలో మన్ కీ బాత్ దోహదం చేసిందని ప్రధాని అన్నారు.
వందో ఎపిసోడ్ సమయం ప్రసారానికి ముందుగా మన్ కీ బాత్‌లో ప్రస్తావించిన కొంతమందితో మోదీ ఫోన్‌లో మాట్లాడారు. మన్ కీ బాత్ రేడియో ప్రసారం కోట్లాది మంది భారతీయుల భావాలను వ్యక్తీకరిస్తుందన్న మోదీ.. ఇది ప్రజలకు ఎప్పుడూ దూరంగా ఉండదని అన్నారు. సెల్ఫీ విత్ డాటర్ ప్రచారం తనను ఎంతో ప్రభావితం చేసిందన్న మోదీ.. ఆ కార్యక్రమాన్ని తాను మన్ కీ బాత్‌లోనే ప్రకటించినట్లు తెలిపారు. అనంతరం సెల్ఫీ విత్ డాటర్ ప్రపంచవ్యాప్తంగా ప్రచారంగా మారిందని మోదీ గుర్తు చేసుకున్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం ప్రజల నుంచి తాను ఎప్పటికీ విడిపోనని నిర్ధరిస్తుందని అన్నారు.
"మన్ కీ బాత్ అంటే ఇతరులలోని మంచి లక్షణాలను ఆరాధించడమే. నాకు ఓ మార్గదర్శి ఉన్నారు. ఆయన పేరు లక్ష్మణరావు ఇనామ్‌దార్. మేం ఆయనను వకీల్ సాహెబ్ అని పిలిచేవారం. ఇతరులలోని మంచి లక్షణాలను మనం ఆరాధించాలని ఆయన ఎప్పుడూ మాకు చెప్తూ ఉండేవారు. మీ సమక్షంలో ఎవరు ఉన్నా సరే, వారు మీ అనుకూలురైనా, ప్రత్యర్థులైనా సరే, వారిలోని మంచి లక్షణాలను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి, వాటి నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. లక్ష్మణరావు ఇనామ్‌దార్‌లోని ఈ లక్షణం నన్ను ఎల్లప్పుడూ ప్రేరేపిస్తోంది. ఇతరుల మంచి లక్షణాల నుంచి నేర్చుకునే గొప్ప మాధ్యమంగా మన్ కీ బాత్ మారింది"
-- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ సందర్భంగా తనకు ప్రజల నుంచి వేలాది ఉత్తరాలు వచ్చాయని, లక్షలాది సందేశాలు వచ్చాయని మోదీ తెలిపారు. సాధ్యమైనన్ని ఉత్తరాలను చదివానని.. వాటిలోని సందేశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించానని చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన ఈ ఉత్తరాలను చదివేటపుడు చాలాసార్లు తాను భావోద్వేగానికి గురయ్యానని మోదీ అన్నారు. ఎంతో మానసిక ఉద్వేగానికి గురై, తనను తాను సముదాయించుకున్నానని చెప్పారు.మన్ కీ బాత్ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత అనేక నెలలు, సంవత్సరాలు గడిచాయంటే నమ్మశక్యంగా లేదని మోదీ అన్నారు.