తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీబీఐ కొత్త చీఫ్‌ ఎంపికపై సోమవారం కీలక భేటీ

కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి కొత్త డైరెక్టర్‌ నియామకంపై సోమవారం భేటీ కానుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ. ఈ పదవికి ఎంపికైన వారు 2023 వరకు కొనసాగనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2 నుంచి తాత్కాలిక డైరెక్టర్‌ సారథ్యంలోనే సీబీఐ పనిచేస్తోంది.

By

Published : May 23, 2021, 1:32 PM IST

CBI
కేంద్ర దర్యాప్తు సంస్థ

కేంద్ర దర్యాప్తు సంస్థకు కొత్త డైరెక్టర్‌ను ఎంపిక చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ సోమవారం భేటీ కానుంది. ఈ కమిటీలో మోదీతో పాటు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ, కాంగ్రెస్‌ లోక్‌సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి సభ్యులు.

జాబితాలో వారి పేర్లు..

ఈ పదవికి 1984-87 బ్యాచ్‌ అధికారుల పేర్లను పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బీఎస్‌ఎఫ్‌, మాదక ద్రవ్యాల నిరోధక సంస్థ చీఫ్‌ రాకేశ్‌ అస్తానా, ఎన్‌ఐఏ చీఫ్‌ వైసీ మోదీ, ఐటీబీపీ డీజీ ఎస్‌ఎస్‌ దేశ్వాల్‌, సీఐఎస్‌ఎఫ్‌ డీజీ సుబోధ్‌ జైశ్వాల్‌, కేరళ డీజీపీ లోఖ్‌నాథ్‌ బెహెరా, యూపీ డీజీపీ హితేశ్‌ చంద్ర అశ్వతి, ఆర్‌పీఎఫ్‌ అధినేత అరుణ్‌ కుమార్‌ పేర్లు ఉన్నాయి. వారి పేర్లను సిబ్బంది, శిక్షణ విభాగం (డీఓపీటీ) ఎంపిక చేసి నియామక కమిటీకి పంపినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

2023 వరకు..

2021, ఫిబ్రవరి 2న సీబీఐ డైరెక్టర్‌ ఆర్‌కే శుక్లా పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి పూర్తి స్థాయి డైరెక్టర్‌ లేకుండానే కొనసాగుతోంది దర్యాప్తు సంస్థ. ప్రస్తుతం 1988 బ్యాచ్‌ గుజరాత్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి ప్రవీణ్ సిన్హా తాత్కాలిక చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు.

సీబీఐ డైరెక్టర్‌ రెండేళ్ల పాటు సేవలందించనున్నారు. కొత్తగా ఎంపికయ్యేవారు 2023 వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు.

సీబీఐకి పూర్తిస్థాయి డైరెక్టర్‌ నియామకంలో జాప్యంపై దాఖలైన పిటిషన్‌పై గత నెలలో విచారణ సందర్భంగా కేంద్రం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది సుప్రీం కోర్టు. మే 2వ తేదీ లోపు నియామక కమిటీ సమావేశం నిర్వహించాలని స్పష్టం చేసింది. సుప్రీం ఆదేశాల మేరకు మే 2లోపు సమావేశం సాధ్యాసాధ్యాలపై సమీక్షించాలని డీఓపీటీ కార్యదర్శి దీపక్‌ ఖందేకర్‌ను ఆదేశించింది కేంద్రం. అయినప్పటికీ.. అది ఆచరణలోకి రాలేదు. అధిర్‌ రంజన్‌ చౌదరి అందుబాటులో లేకపోవటం వల్ల కమిటీ సమావేశం కాలేకపోతోందని సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో తెలిపింది కేంద్రం.

ఇదీ చూడండి:రాజకీయ కేంద్ర దర్యాప్తు సంస్థ.. రాజ్యాంగ నైతికత ఏది?

ABOUT THE AUTHOR

...view details