సికింద్రాబాద్ నుంచి తిరుమలకు కూతపెట్టిన వందేభారత్ రైలు.. జెండా ఊపి ప్రారంభించిన మోదీ Pm Modi Launches Vande Bharat Train at Secunderabad : అంసెబ్లీ ఎన్నికల ముంగిట రాష్ట్రంలో పర్యటించిన... ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారంచుట్టారు. ఉదయం పదకొండున్నర గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి... గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు అధికారులు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకున్నారు.
secunderabad to Tirupati Vande Bharat Train : రైల్వేస్టేషన్‌లోని వందేభారత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులోకి వెళ్లిన ప్రధాని మోదీ... పాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు. రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులకు అభివాదం చేస్తూ ప్రధాని మోదీ... 10 నంబర్ ప్లాట్‌ఫాం వద్దకు చేరుకున్నారు. ఆయనకు చేర్యాల పెయింటింగ్‌ని రైల్వేశాఖమంత్రి అశ్వినీ వైష్ణవ్ అందించారు. అనంతరం తెలుగురాష్ట్రాల మధ్య నడవనున్న రెండో వందేభారత్ రైలును... ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సికింద్రాబాద్- తిరుపతి మధ్య నడిచే వందేభారత్ రైలును ప్రధాని మోదీ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించారు.
Secunderabad to Tirupathi Vande Bharat Express : సాధారణంగా మిగతా రైళ్లు సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య చేరుకునేందుకు... దాదాపు 12 గంటల సమయం పడుతుండగా... గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్న... వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మాత్రం దాదాపు 8.30 గంటల్లోనే చేరుకుటుందని అధికారులు తెలిపారు. నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరులో ఆ రైలు అగుతుందని రైల్వేశాఖ వెల్లడించింది. తొలుత 8 కోచ్‌లతోనే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపించనున్నట్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే... అందులో ప్రస్తుతం 7 ఏసీ ఛైర్‌కార్ కోచ్‌లు, 1 ఏసీ ఎగ్జిక్యూటివ్ కోచ్ ఉంటుందని వివరించింది.
తిరుపతి-సికింద్రాబాద్ వందేభారత్‌లో అందుబాటులో 530 సీట్లు ఉంటాయని పేర్కొన్నారు. రద్దీకి అనుగుణంగా భవిష్యత్‌లో కోచ్‌లను పెంచనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వివరించారు. ఒక్క మంగళవారం మినహా మిగిలిన అన్ని రోజులు వందేభారత్ రైలు సేవలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. మేకిన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య తొలివందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును.... కొద్దినెలల క్రితం ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించారు. తాజాగా తెలుగురాష్ట్రాల్లోని సికింద్రాబాద్- తిరుపతి మధ్య నడిచే రెండో వందేభారత్ రైలును సైతం ప్రధాని మోదీ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే వివిధ ప్రాంతాల మధ్య కేంద్రం 12 వందేభారత్ రైళ్లను నడపుతోంది.
ఇవీ చదవండి: