సరిహద్దుల్లో భారత్-చైనా బలగాల ఉపసంహరణ, జియో స్పేషియల్ డేటా సంస్కరణల విషయంలో ప్రభుత్వ నిర్ణయం... భారతదేశ ధైర్యానికి నిదర్శనమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నాస్కామ్ టెక్నాలజీ అండ్ లీడర్షిప్ ఫోరమ్ సదస్సును బుధవారం వర్చువల్‌గా ప్రారంభించిన మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
" మ్యాప్‌ల తయారీ, జియోస్పేషియల్ డేటా ఉత్పత్తిపై ప్రభుత్వ నియంత్రణలు తొలగిపోయాయి. గతంలో భద్రతా సమస్యలు ఎక్కువగా ఉండేవి. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. సరిహద్దుల విషయంలోనూ భారత్ ధైర్యం కనబరుస్తోంది. నమ్మకంతో ఉంటోంది. నమ్మకమే మహా బలం"
-నరేంద్ర మోదీ, ప్రధాని.
ప్రభుత్వ నిర్ణయాలు భారత దేశ సామర్థ్యానికి నిదర్శనమని మోదీ అన్నారు. ఇలాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నా భద్రత విషయంలో అవాంతరాలను భారత్ ఎదుర్కోగలదని పేర్కొన్నారు.
ఆలోచన మారాలి....
లాభనష్టాల గురించి మాత్రమే కాకుండా సంస్థగా ఎదగడమెలా? అని అలోచించాలని అంకురాల వ్యవస్థాపకులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు.
"లాభనష్టాల దృష్ట్యా మాత్రమే అంకురాలు స్థాపించకూడదు. ప్రపంచవ్యాప్తంగా మంచి ఫలితాలనిచ్చే ఉత్తమ సంస్థగా ఎదిగేందుకు యోచించాలి. దేశంలో ఎక్కువ జనాభా ఉండటం వల్ల ఐటీ రంగానికి మరింత బలం చేకూరుతుంది. ఎందుకంటే ప్రజలు కొత్త విధానాల కోసం ఎదురు చూస్తుంటారు. ఐటీ రంగ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ... గ్రామీణ ప్రాంతాల ఆలోచనా విధానాన్ని మార్చేందుకు దోహదపడుతుంది"
-నరేంద్ర మోదీ, ప్రధాని
ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి దిశగా ఐటీ రంగం అడుగులేయాలని మోదీ అన్నారు.
ప్రభుత్వానికి తెలుసు..
పురోగతికి యువత సహనంతో లేరన్న మోదీ... ఇప్పటి యువతకు ఏం కావాలో ప్రభుత్వానికి తెలుసని అన్నారు. పురోగతి సాధించేందుకు యువత ప్రభుత్వం వైపు, ప్రైవేట్ సెక్టార్ వైపు చూస్తోందని వ్యాఖ్యానించారు. కరోనా పరిస్థితుల్లో ఐటీ రంగం అభివృద్ధి చెందడంపై హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని ఘనతలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్(నాస్కామ్)కు సంబంధించిన 29వ ఎడిషన్ ఎన్టీఎల్ఎఫ్ కార్యక్రమం ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు నిర్వహిస్తున్నారు. 'షేపింగ్ ద ఫ్యూచర్ టువర్డ్స్ ఏ బెటర్ నార్మల్' అనేది ఈ ఏడాది సదస్సు థీమ్. వర్చువల్‌గా జరుగుతున్న ఈ కార్యక్రమంలో 30 దేశాలకు చెందిన 1600 మంది పాల్గొంటున్నారు.
ఇదీ చదవండి:బిచ్చమెత్తుకునే అభాగ్యురాలిపై ఐదుగురు హత్యాచారం