కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలని దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. కరోనా జాగ్రత్తలన్నీ పాటించాలని కోరారు. చాలా దేశాల్లో కరోనా తీవ్రంగా వ్యాపిస్తోందన్న మోదీ.. పండగ సమయాల్లో ప్రజలంతా మాస్కులు ధరించాలని పిలుపునిచ్చారు. పండగ సంతోషాన్ని వైరస్ ప్రభావితం చేయకుండా చూసుకోవాలని మోదీ పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి మన్‌కీబాత్‌లో మాట్లాడిన ప్రధాని.. 2022 ఏడాది అనేక విధాలుగా భారత్‌కు స్ఫూర్తిదాయకంగా నిలిచిందని చెప్పారు.
ఈ ఏడాది భారత్ ప్రపంచంలోనే ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించటమే కాకుండా 220కోట్ల టీకా డోసులు పంపిణీ, ఎగుమతులు 400బిలియన్ డాలర్లు దాటడం వంటి ఎన్నో ఘనతలు సాధించినట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశం ఆత్మ నిర్భర్ భారత్ దిశగా సాగుతోందన్నారు. మొదటి స్వదేశీ తయారీ యుద్ధవిమాన వాహకనౌక ఐఎన్ఎస్ విక్రాంత్ నౌకాదళంలో చేరినట్లు ప్రధాని చెప్పారు. అంతరిక్ష, డ్రోన్, రక్షణ రంగాల్లో అనేక విజయాలు సాధించినట్లు తెలిపారు. ఈ ఏడాది దేశం కొత్త గతిని సాధించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
"2022లో దేశ ప్రజల సామర్థ్యం, వారి సహకారం, వారి సంకల్పం, వారి విజయాల పరంపర చాలా ఎక్కువగా ఉంది. మన్ కీ బాత్‌లో అవన్నీ చెప్పటం కష్టమవుతుంది. 2022 సంవత్సరం చాలా ప్రేరణగా, అద్భుతంగా నిలిచింది. ఈ ఏడాది భారత్ స్వాతంత్ర్యం సాధించి 75ఏళ్లు పూర్తి చేసుకుంది. అలాగే అమృతోత్సవాల్లోకి అడుగుపెట్టింది. ఈ ఏడాది దేశం కొత్తగతిని అందుకుంది. దేశప్రజలు ఒకర్ని మించి ఒకరు శ్రమించారు. ఈ ఏడాది వివిధ రంగాల్లో సాధించిన విజయాల ద్వారా భారత్ ప్రపంచంలోనే ప్రత్యేక స్థానం పొందింది."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి