PM Modi japan visit: జపాన్‌లో ఈనెల 24న జరగనున్న క్వాడ్ దేశాధినేతల సమావేశంలో పాల్గొననున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇందులో భాగంగా జపాన్ పర్యటనకు బయలుదేరే ముందు క్వాడ్ సదస్సుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ గ్రూప్ మొదలుపెట్టిన పలు పనుల పురోగతిని సమీక్షించటం, ఇండో- ఫసిఫిక్ ప్రాంత అభివృద్ధి, అంతర్జాతీయ అంశాలపై ఆలోచనలు పంచుకునేందుకు ఈ సమావేశం గొప్ప అవకాశంగా పేర్కొన్నారు. మే 23-24 మధ్య రెండు రోజుల పాటు జపాన్‌లో పర్యటించనున్నారు భారత ప్రధాని.
" ఈ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొననున్నాను. బహుముఖ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ప్రాంతీయ అభివృద్ధి, అంతర్జాతీయ సవాళ్లపై చర్చించనున్నాం. జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా ఆహ్వానం మేరకు టోక్యో వెళ్తున్నాను. టోక్యో పర్యటన సందర్భంగా.. భారత్- జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు చర్చలు చేపడతాం. ఆ తర్వాత జపాన్‌లో జరగనున్న క్వాడ్ దేశాధినేతల సమావేశంలో పాల్గొంటాను. ఈ గ్రూప్ మొదలుపెట్టిన పనుల పురోగతిని సమీక్షించేందుకు నాలుగు దేశాల నేతలకు ఈ సదస్సు గొప్ప అవకాశం. అలాగే.. ఇండో-ఫసిపిక్ ప్రాంత అభివృద్ధి, అంతర్జాతీయ అంశాలపై మా ఆలోచనలను పంచుకోనున్నాం."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
తొలిసారి క్వాడ్ సదస్సుకు ఆస్ట్రేలియా నూతన ప్రధాని ఆంటోని అల్బనీస్ హాజరవుతారని చెప్పారు మోదీ. ఆయనతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొని ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, పరస్పర ప్రయోజనాల కోసం అంతర్జాతీయ అంశాలపైనా చర్చించనున్నట్లు పేర్కొన్నారు. భారత్, జపాన్ల మధ్య ఆర్థిక సహకారం కోసం ఇరు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక, గ్లోబల్ భాగస్వామ్యం కీలకమని స్పష్టం చేశారు. గత మార్చిలో జరిగిన సదస్సులో పీఎం కిషిదాతో జరిగిన ఒప్పందాలను గుర్తు చేసుకున్నారు మోదీ. భారత్‌లో 5 ట్రిలియన్ జపాన్ యెన్ల పెట్టుబడులకు ఒప్పందం కుదిరినట్లు చెప్పారు. సుమారు 40వేల మంది ప్రవాస భారతీయులు జపాన్‌లో ఉన్నారని, వారే ఇరు దేశాల మధ్య సత్సంబంధాలకు వారిధిగా పేర్కొన్నారు.