PM Modi ISRO Visit To Congratulate Scientists : ఎవరూ చేరలేని చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపింది విక్రమ్ ల్యాండర్. ఇంతటి ఘనత సాధించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ- ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల బృందాన్ని అభినందించడానికి ప్రధాని నరేంద్ర మోదీ శనివారం బెంగళూరుకు రానున్నట్లు సంబంధింత వర్గాలు తెలిపాయి. ఆగస్టు 26న ఉదయం 7 గంటలకు బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్- ISTRAC కేంద్రానికి చేరుకుంటారు. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు ప్రధాని ఇస్రో శాస్త్రవేత్తలతో సమావేశమవుతారు. అనంతరం ఉదయం 8.05 అక్కడి నుంచి బయలుదేరి 8.35 గంటలకు దిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.
ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. బుధవారం అక్కడి నుంచి చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్‌ను వీక్షించారు. తర్వాత జాతిని ఉద్దేశించి ప్రసంగించి ఇస్రో బృందాన్ని అభినందించారు.
కర్ణాటక ఉప ముఖ్యంమత్రి డీకే శివకుమార్ బుధవారం సాయంత్రం ఇస్రోను సందర్శించారు. చంద్రయాన్-3 ప్రాజెక్టు విజయవంతం కావడంపై ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్, శాస్త్రవేత్తల బృందాన్ని అభినందించారు. ఇస్రో చీఫ్ సోమనాథ్, యుఆర్ రావు స్పేస్ సెంటర్ డైరెక్టర్ శంకరన్, ప్రాజెక్ట్ డైరెక్టర్ వీరముత్తు, అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కల్పన, మెషిన్ మెయింటెనెన్స్ డైరెక్టర్ శ్రీకాంత్, ఇతర శాస్త్రవేత్తలను డీకే శివకుమార్ 'మైసూరు పేట'తో.. శాలువాలు, పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు.
'చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్‌ని విజయవంతంగా దింపిన మీ విజయం అభినందనీయం. మీరు భారతదేశానికే గర్వకారణం' అని డీకే శివకుమార్ ఇస్రో శాస్త్రవేత్తలను, ఇంజినీర్లను కొనియాడారు. అనంతరం చంద్రయాన్ 3 ప్రాజెక్టు గురించి వివరాలు తెలుసుకున్నారు. చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ విజయవంతం కావడం కోసం ఇస్రో శాస్త్రవేత్తలు, సిబ్బంది అందరూ చేసిన కృషి మరువలేనిదన్నారు.