కరోనాను జయించేందుకు భారతీయ శాస్త్రవేత్తలు టీకాను అభివృద్ధి చేసి వారి బాధ్యతను నిర్వర్తించారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసించారు. అయితే ప్రస్తుతం టీకా సమర్థత, పని తీరుపై వస్తోన్న వదంతులకు యువతే అడ్డుకట్ట వేయాలని పిలుపునిచ్చారు.
గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొనేందుకు దేశం నలుదిశల నుంచి వచ్చిన ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వలంటీర్లతో దిల్లీలో ప్రధాని సమావేశమయ్యారు. కష్టకాలంలో ఇలాంటి సంస్థలు కీలక పాత్ర పోషించాయని కితాబిచ్చారు. కరోనా సమయంలోనూ ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్లో ఉండే వారు అందించిన సేవలు గొప్పవని ప్రధాని కొనియాడారు. ప్రభుత్వాలకు అవసరం అన్న ప్రతిసారీ ఎటువంటి లాభాపేక్ష లేకుండా.. మేమున్నాం అంటూ ముందుకు వచ్చినట్లు గుర్తు చేశారు.
"యువత ముందుకు రావాల్సిన సమయం ఇది. టీకాల సమర్థతపై నెలకొన్న అనుమానాలను మీరే తొలగించాలి. సమాజంలో మీ భాగస్వామ్యం ఎక్కువ ఉంది. టీకాపై వస్తున్న అపోహలను తొలగిస్తూ.. పేద, మధ్యతరగతి ప్రజలకు సరైన సమాచారాన్ని అందించాలి. ఈ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్లాల్సింది మీరే. ఆత్మనిర్భర భారత్ మీతోనే సాకారం అవుతోంది."