PM Modi Independence Day Speech : భారతదేశాన్ని అవినీతి, వారసత్వ, బుజ్జగింపు రాజకీయాలు పట్టిపీడిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వాటిని సమూలంగా నిర్మూలించాలని దేశ ప్రజలను కోరారు. అవినీతికి వ్యతిరేకంగా యుద్ధం చేయాలని.. వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. సాంకేతిక అభివృద్ధి సాయంతో అవినీతిని అరికట్టే ప్రయత్నం వేగంగా సాగుతోందని అన్నారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోటపై జెండా ఎగురవేసిన అనంతరం ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు.
"అవినీతి, వారసత్వ, బుజ్జగింపు రాజకీయాలను సమూలంగా నిర్మూలిస్తేనే దేశ అభివృద్ధి నిరాంటంకంగా సాగుతుంది. అవినీతి చెదలను సమూలంగా తుదముట్టించాలి. బుజ్జగింపు రాజకీయాలను మానుకోవాలి. పారదర్శక విధానాలతో అవినీతి నిర్మూలనకు ప్రయత్నాలు సాగుతున్నాయి. వారసత్వ, బుజ్జగింపు రాజకీయాలు దేశానికి కోలుకోలేని నష్టం మిగిల్చాయి. అవినీతి, వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నాయి."
--నరేంద్ర మోదీ, భారత ప్రధాని
PM Modi Speech On Independence Day :వారసత్వ రాజకీయాలు భారత ప్రజాస్వామ్యానికి కొత్త అర్థానిచ్చాయనిప్రధాని మోదీతెలిపారు. కుటుంబం కోసం, కుటుంబం చేత, కుటుంబానికే మేలు అన్నట్లుగా తయారయ్యాయని ఉద్ఘాటించారు. కుటుంబ పార్టీలతో దేశానికి నష్టమే తప్ప లాభముండదని విమర్శించారు. 2047లో అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఆవిష్కృతం కావాలంటే అవినీతికి స్వస్తి చెప్పాలని అన్నారు.