PM Modi New Parliament : నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఉదయం ఏడున్నర గంటలకు పార్లమెంట్ ప్రాంగణానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తొలుత మహాత్మ గాంధీ విగ్రహానికి నివాళులు ఆర్పించారు. అనంతరం నూతన పార్లమెంట్ భవనం వద్ద జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ కర్ణాటకలోని శృంగేరి మఠం నుంచి విచ్చేసిన అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య తొలుత గణపతి హోమం నిర్వహించారు. ఆ తర్వాత చారిత్రక రాజదండం సెంగోల్‌కు ప్రధాని మోదీ సాష్టాంగ నమస్కారం చేశారు. అనంతరం ప్రధాని మోదీకి సెంగోల్‌ను వేద పండితులు అందజేశారు. చేతిలో పవిత్ర రాజదండం ధరించిన ప్రధాని మోదీ తమిళనాడులోని వివిధ అధీనాల నుంచి వచ్చిన వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు.
సెంగోల్‌కు సాష్టాంగ నమస్కారం చేస్తున్న ప్రధాని మోదీ అనంతరం నాదస్వరం, వేద మంత్రోచ్ఛారణల మధ్య సెంగోల్‌ను ఊరేగింపుగా కొత్త పార్లమెంటు భవనం వరకు ప్రధాని మోదీ తీసుకువెళ్లారు. లోక్‌సభ ఛాంబర్‌లోని స్పీకర్ కుర్చీకి కుడి వైపున ఉన్న ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లో దాన్ని ప్రతిష్ఠించారు. ఆ తర్వాత ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా జ్యోతి ప్రజ్వలన చేశారు.
సెంగోల్‌ను నెలకొల్పుతున్న ప్రధాని మోదీ కార్మికులకు సన్మానం..
All Religion Prayer Parliament : ఆ తర్వాత శిలా ఫలకాలను ఆవిష్కరించారు ప్రధాని మోదీ. అనంతరం నూతన పార్లమెంట్ భవన నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన కార్మికులను శాలువతో సత్కరించి.. ప్రధాని జ్ఞాపికలు అందజేశారు.
కొత్త పార్లమెంట్ భవన నిర్మాణంలో పాల్గొన్న కార్మికులను సత్కరిస్తున్న ప్రధాని మోదీ అనంతరం నూతన పార్లమెంటు భవనం ప్రాంగణంలో సర్వమత ప్రార్థనలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, జైశంకర్, బీజేపీ అధ్యక్షుడు జేడీ నడ్డా, పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు పాల్గొన్నారు.
నూతన పార్లమెంట్ భవనంలో సర్వమత ప్రార్థనలు మోదీ ట్వీట్..
కొత్త పార్లమెంటు భవనం ప్రారంభించినప్పుడు.. మన హృదయాలు, మనసులు గర్వం, ఆశలు, వాగ్దానాలతో నిండిపోయాయని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ చరిత్రాత్మక భవనం దేశ పురోగతిని మరింత పెంచుతుందని తెలిపారు.
మీర్జాపుర్ తివాచీలు.. త్రిపుర గచ్చు..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపుర్ నుంచి తీసుకువచ్చిన తివాచీలు, త్రిపుర వెదురుతో సిద్ధం చేసిన గచ్చు, రాజస్థాన్‌లో రూపుదిద్దుకున్న శిలాకృతులు, రాజస్థాన్‌లోని సర్‌మధుర నుంచి ఎర్ర చలువరాయి, అంబాజీ నుంచి తెల్ల చలువరాయిని, ఉదయ్‌పుర్ నుంచి కేసరియా ఆకుపచ్చరాయి, లఖా నుంచి తెచ్చిన ఎర్ర గ్రానైట్ పార్లమెంట్ నిర్మాణంలో ఉపయోగించారు. ఫర్నిచర్‌ను ముంబయి నుంచి రప్పించారు. అశోకచిహ్నం కోసం సామగ్రిని ఔరంగాబాద్ నుంచి, ఉభయసభల్లో భారీ గోడలపై అశోక చక్రం రూపొందించడానికి ఇందౌర్ నుంచి సామగ్రి తీసుకువచ్చారు. ఏక్‌భారత్.. శ్రేష్ఠ భారత్ స్ఫూర్తి పరిఢవిల్లేలా యావద్దేశానికీ ఏదోఒక రూపంలో ఈ భవన నిర్మాణంలో ప్రాతినిధ్యం లభించింది.
కొత్త పార్లమెంట్ భవనం ప్రత్యేకతలు..
New Parliament Building Features : 64,500 చదరపు మీటర్ల వైశాల్యంలో నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. త్రికోణాకారంలో కట్టిన ఈ భవనంలో నాలుగంతస్తులు ఉన్నాయి. ఒకేసారి 1,274 మంది ఎంపీలు కూర్చోవడానికి వీలుగా దీన్ని నిర్మించారు. లోక్‌సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నిర్మించిన ఈ కొత్త భవనంలో కాన్‌స్టిట్యూషన్ హాల్, ఎంపీల కోసం ఒక లాంజ్, గ్రంథాలయం, కమిటీ హాళ్లు, విశాలమైన పార్కింగ్ ఏర్పాట్లు ఉన్నాయి. వీఐపీలు, ఎంపీలు, సందర్శకులకు వేర్వేరు ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేశారు. ప్రధాన ద్వారాలకు జ్ఞాన, శక్తి, కర్మలుగా నామకరణం చేశారు.
ఓపెనింగ్‌కు ప్రతిపక్షాలు దూరం..
New Parliament Building Opposition : నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపించారు. పార్లమెంట్ భవన ఆర్కిటెక్ట్ బీమా పటేల్, నిర్మాణ సంస్థ టాటాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటాను సైతం ఆహ్వానించారు. అయితే, పార్లమెంటు నూతన భవనాన్ని రాజ్యాంగ అధినేత రాష్ట్రపతి కాకుండా ప్రధానమంత్రి ప్రారంభించనుండటాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తూ 19 విపక్ష పార్టీలు ఇటీవల సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, RJD, DMK, శివసేన-UBT, JMM, సమాజ్ వాదీ వంటి పార్టీలు ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన జాబితాలో ఉన్నాయి. మరోవైపు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో సహా 25 పార్టీలు ప్రారంభోత్సవానికి హాజరయ్యాయి.