తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నూతన పర్యటక యుగానికి నాంది'.. 'గంగా విలాస్' నౌకను ప్రారంభించిన మోదీ

ప్రపంచంలో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే క్రూయిజ్ నౌక 'ఎంవీ గంగా విలాస్'ను ప్రధాని మోదీ వర్చువల్​గా ప్రారంభించారు. వారణాసిలో జరిగిన ఈ కార్యక్రమానికి ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ హాజరయ్యారు. మరోవైపు వారణాసిలో గంగానది ఒడ్డును ఉన్న టెంట్​ సిటీని సైతం మోదీ ప్రారంభించారు. ​

PM Modi inaugartes mv ganga vilas
ఎంవీ గంగా విలాస్​ను ప్రారంభించిన ప్రధాని మోదీ

By

Published : Jan 13, 2023, 12:49 PM IST

ప్రపంచంలో అత్యంత ఎక్కువ దూరం పయనించే నదీ క్రూయిజ్‌ షిప్ 'ఎంవీ గంగా విలాస్‌'ను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. వారణాసిలోని రవిదాస్ ఘాట్​లో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ వర్చువల్​గా హాజరయ్యారు. రూ.1,000 కోట్లు విలువైన పలు ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్ పాల్గొన్నారు. అలాగే 'ఎంవీ గంగా విలాస్' నౌక ప్రారంభోత్సవ కార్యక్రమంలో బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ సైతం వర్చువల్​గా హాజరయ్యారు.

క్రూయిజ్ నౌక 'గంగా విలాస్' సర్వీసు ప్రారంభం.. భారత్​లో నూతన పర్యటక యుగానికి నాంది పలుకుతుంది. ఇది ప్రపంచ పర్యటక పటంలోని ప్రాచీన భారతదేశ స్థలాలు, ప్రముఖ క్షేత్రాలు చూపిస్తుంది. ఈ సందర్భంగా విదేశీ పర్యటకులందరికీ నేను ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఈ నౌక భారత్​ పర్యటకులను పెంచుతుంది. కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుంది. దేశంలోని పలు ప్రాంతాల్లో నదీ క్రూయిజ్​ నౌకలకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం.

--నరేంద్ర మోదీ, ప్రధాని

వారణాసిలోని గంగా నది ఒడ్డున నిర్మించిన టెంట్​ సిటీని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ ప్రాంతాన్ని పర్యటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఈ టెంట్ సిటీని నిర్మించింది. టెంట్ సిటీలో పర్యటకులను ఆకట్టుకునేందుకు లైవ్ క్లాసికల్ మ్యూజిక్​,యోగా సెషన్​లను ఏర్పాటు చేశారు. ఈ సిటీ జూన్​ నుంచి అక్టోబరు మాత్రమే ఉంటుంది. వర్షాకాలంలో గంగా నది నీటి మట్టం పెరిగినప్పుడు మూడు నెలల పాటు అందుబాటులో ఉండదు.

టెంట్ సిటీ
టెంట్ సిటీ
టెంట్ సిటీ

గంగా విలాస్ గురించి..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఎంవీ గంగా విలాస్​ నౌక.. భారత్‌, బంగ్లాదేశ్‌లో 27నదుల గుండా 51 రోజుల్లో 3,200 కిలోమీటర్ల దూరం పయనించనుంది. భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా రూపొందించిన ఈ నౌకలో ప్రయాణికుల కోసం అత్యాధునిక సౌకర్యాలను ఏర్పాటు చేశారు. సూట్‌ గదులు, స్పా, జిమ్‌ సెంటర్ల వంటివి ఇందులో ఉన్నాయి.

51 రోజుల్లో 50 పర్యటక స్థలాలు..
భారత్‌లోని ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, బంగాల్‌, అసోంతో పాటు బంగ్లాదేశ్‌లోని నదుల్లో ఈ నౌక పయనించనుంది. ప్రధాన నదులైన గంగా, బ్రహ్మపుత్రతో పాటు భాగీరథి, హుగ్లీ, బిద్యావతి, మాట్లా, బంగ్లాదేశ్‌లో మేఘన, పద్మ, జమున నదుల్లో విహరిస్తుంది. గంగా విలాస్‌ యాత్ర ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో మొదలై అసోంలోని దిబ్రుగఢ్‌లో ముగుస్తుంది. మొత్తం 51 రోజుల ఈ సుదీర్ఘ ప్రయాణంలో 50 ప్రసిద్ధ పర్యటక ప్రాంతాల్లో ఆగుతుంది.

ఎంవీ గంగా విలాస్ నౌక

ఉత్తర్‌ప్రదేశ్‌లో వారణాసి, బిహార్‌లోని పట్నా, ఝార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్‌, బంగాల్‌లోని కోల్‌కతా, బంగ్లాదేశ్‌లో ఢాకా, అసోంలోని గువహటిలో ఉన్న ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, జాతీయ పార్కులు, నదీ ఘాట్‌ల గుండా ఈ నౌక పయనించనుంది. వారణాసిలో గంగా హారతి, బౌద్ధమతానికి కీలకమైన సారనాథ్‌, తాంత్రిక్‌ క్రాఫ్ట్‌కు ప్రసిద్ధిగాంచిన మయోంగ్‌, ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం మజులి, బిహార్‌లోని విక్రమశిల యూనివర్శిటీ, రాయల్‌ బంగాల్‌ పులులకు ప్రఖ్యాతిగాంచిన సుందర్బన్‌ డెల్టా, ఖడ్గమృగాలు ఉండే కజీరంగా నేషనల్‌ పార్కు లాంటి ప్రపంచ వారసత్వ ప్రాంతాలను ఈ యాత్రలో చూడొచ్చు.

ఎంవీ గంగా విలాస్ నౌకలోని భోజనశాల

లగ్జరీ సదుపాయాలు..
62 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు ఉండే ఈ భారీ క్రూజ్‌లో 18 సూట్లు ఉన్నాయి. 36 మంది ప్రయాణికులు ఇందులో ప్రయాణించొచ్చు. మూడు సన్‌ డెక్‌లు, జిమ్‌ సెంటరు, స్పా సదుపాయం ఉంది. నదీ వ్యూ కన్పించేలా ఉండే పారదర్శక లాంజ్‌లో ప్రకృతి అందాలను ఆస్వాదించొచ్చు. ప్రయాణికులను ఆహ్లాదపర్చేలా నౌకలో కళా సాంస్కృతిక ప్రదర్శనలూ ఏర్పాటు చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details