దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉందని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సామాజిక రుగ్మతను పూర్తిగా నిర్మూలించి భారత్‌ను సరికొత్త శిఖరాలకు చేర్చేందుకు కృషి చేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. వివక్షకు ఏ మాత్రం తావు లేని సమాజ నిర్మాణం జరుగుతోందని, భారత్ ఇప్పుడు కొత్తగా ఆలోచిస్తుందని ఉద్ఘాటించారు.
'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సే స్వర్ణిమ్ భారత్ కే ఓర్' జాతీయ స్థాయి కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా.. ఏడాది పొడవునా బ్రహ్మకుమారీస్ నిర్వహించే ఈ కార్యక్రమాలకు ప్రధాని శ్రీకారం చుట్టారు. 30కిపైగా క్యాంపెయిన్లు, 15 వేలకుపైగా వివిధ కార్యక్రమాలు ఇందులో భాగంగా ఉన్నాయి.
''వివక్షకు తావు లేని వ్యవస్థను మేం రూపొందిస్తున్నాం. సమానత్వం, సామాజిక న్యాయం అనే పునాదులపై బలంగా నిలబడే సమాజాన్ని నిర్మిస్తున్నాం. వినూత్నమైన ఆలోచనా విధానం, ప్రగతిశీల నిర్ణయాలతో కూడిన భారత్‌ను మనం ఇప్పుడు చూస్తున్నాం.''
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి