పుదుచ్చేరిలో ఇటీవలే కుప్పకూలిన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మాజీ సీఎం నారాయణస్వామి ప్రభుత్వానికి.. ప్రజల సంక్షేమానికి మించి ఇతర ప్రాధాన్యాలు ఉన్నాయని ఆరోపించారు. గత ఐదేళ్లుగా వాటిని ప్రజలు చూస్తూనే ఉన్నారని పేర్కొన్నారు.
త్వరలో ఎన్నికలు జరగనున్న పుదుచ్చేరిలో గురువారం పర్యటించారు మోదీ. వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధాని.. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్, పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీపై మండిపడ్డారు.
"వలస వచ్చిన వారు.. మనపై 'విభజించి పాలించు' విధానాన్ని అమలు చేశారు. కాంగ్రెస్‌కు అయితే.. 'అది విభజించి, అబద్ధం చెప్పి, పాలించు'. ఆ పార్టీ నేతలు కొన్నికొన్ని సార్లు.. ప్రాంతాల వారీగా, వర్గాల వారీగా దేశాన్ని విభజిస్తారు."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
ఇటీవల 'ఉత్తర-దక్షిణ' రాజకీయాలపై రాహుల్ గాంధీ మాటల వివాదాస్పదమైన నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తర భారతంలో రాజకీయాలు ఉంటాయని.. దక్షిణాది ప్రజలు సమస్యల గురించే ఎక్కువ ఆలోచిస్తారని పుదుచ్చేరి, కేరళ పర్యటనల్లో అన్నారు రాహుల్.
మరోవైపు.. మత్స్యకారుల సంక్షేమం కోసం కేంద్రంలో ఎలాంటి విభాగం లేదన్న రాహుల్ వ్యాఖ్యలతో షాక్ అయినట్టు వెల్లడించారు మోదీ. మత్స్యశాఖకు 2019 నుంచి బడ్జెట్లో కేటాయింపులు పెంచిన విషయాన్ని గుర్తుచేశారు.
పుదుచ్చేరిలో గత ప్రభుత్వం.. కాంగ్రెస్ 'హైకమాండ్'కు, కొందరు కాంగ్రెస్ నేతలకు మాత్రమే సేవ చేసిందని ఆరోపించారు మోదీ. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏను గెలిపిస్తే ప్రజలనే 'హైకమాండ్'గా భావించి పాలిస్తామని స్పష్టం చేశారు.
అభివృద్ధి పనులకు శ్రీకారం..
పుదుచ్చేరి పర్యటనలో పలు అభివృద్ధి ప్రాజెక్ట్‌లను ప్రారంభించారు మోదీ. వాటిలో జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్టుగ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(జిప్మర్)లో రక్త నిధి కేంద్రం ఒకటి. రానున్న కాలంలో ఆరోగ్య సంరక్షణ విభాగంలలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఈ విభాగంలో మరిన్ని పెట్టుబడులు పెరుగుతాయని చెప్పారు మోదీ. అందరికీ నాణ్యమైన ఆరోగ్యాన్ని అందించాలనే లక్ష్యంతోనే జిప్మర్లో రక్తనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా రైతుల అంశంపైనా ప్రస్తావించారు మోదీ. అన్నదాతలు వ్యవసాయంలో వినూత్న ప్రయోగాలు చేస్తున్నారని, వారి ఉత్పత్తులకు తగినట్టుగా మంచి మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావడమే తమ కర్తవ్యమన్నారు. ఇక్కడి నాలుగు వరుసల రహదారి(ఫోర్ లేనింగ్)తో పరిశ్రమలను ఆకర్షించడం సహా.. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
ఇదీ చూడండి:'కృత్రిమ సరస్సు' నీటి విడుదల ప్రయత్నం సఫలం