PM Modi in Pathankot: పంజాబ్‌లోని పేదలతో పాటు దేశంలో కోట్లాది మంది ప్రజలు ఆకలితో ఉండకూడదని ఉచితంగా రేషన్ సరఫరా చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ... విపక్షాలపై విమర్శలు గుప్పించారు. ఏఏ రాష్ట్రాల్లో అయితే భాజపా నిలదొక్కుకునే స్థితికి చేరుకుంటుందో.. అక్కడ కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతోందని మోదీ చెప్పారు.
కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఒక్కటేనని ఆరోపించారు మోదీ. ఒకరు పంజాబ్‌ను లూటీ చేస్తే.. మరొకరు దిల్లీలో స్కాముల మీద స్కాములు చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు.
"మాకు పంజాబ్ చాలా ముఖ్యం. విపక్షాలు మాత్రం పంజాబ్‌ను రాజకీయ కోణంలోనే చూస్తుంటాయి. బుజ్జగింపు రాజకీయాలకు పంజాబ్ వీడ్కోలు పలకాల్సిన సమయం ఆసన్నమైంది. కెప్టెన్ సాబ్(అమరీందర్ సింగ్) కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు.. ఆ పార్టీ తప్పుడు మార్గంలో వెళ్లకుండా ఆపేవారు. ఇప్పుడు ఆయన కూడా అందులో నుంచి బయటకు వచ్చారు. ఆప్, కాంగ్రెస్ రెండూ ఒకటే. కాంగ్రెస్ ఒరిజినల్ అయితే.. ఆప్ దానికి ఫొటోకాపీ. వీరిద్దరూ ఒక్కటే అయినా.. పంజాబ్‌లో మాత్రం ఒకరిపై ఒకరు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు."