తెలంగాణ

telangana

By

Published : Feb 22, 2022, 2:28 PM IST

ETV Bharat / bharat

'భాజపా ఐదేళ్లలో చేసిన అభివృద్ధి.. వచ్చే 25ఏళ్లకు పునాది'

PM Modi in manipur: మణిపుర్​లో గత ఐదేళ్లలో భాజపా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు వచ్చే 25 ఏళ్లకు పునాది వేశాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తాము మరోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​పై విమర్శలు చేశారు.

modi manipur
మోదీ మణిపుర్

PM Modi in manipur: భాజపా డబుల్ఇంజిన్ ప్రభుత్వం గత ఐదేళ్లలో మణిపుర్ అభివృద్ధికి విశేషంగా పాటుపడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ అభివృద్ధి వచ్చే 25 ఏళ్లకు పునాది వేసిందని అన్నారు. మణిపుర్​లోని హీంగాంగ్​లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.. రాష్ట్రంలో భాజపా మరోసారి అధికారంలోకి వస్తుందని అన్నారు.

Modi Election campaign

"గత ఐదేళ్లలో భాజపా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, సుపరిపాలన, అభివృద్ధిని మీరు చూశారు. గత నెలలో మణిపుర్ 50వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంది. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పాలించింది. ఈ కాలంలో అసమానతలే రాజ్యమేలాయి. బంద్​లు, దిగ్బంధాల నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేశాం. భాజపా ప్రభుత్వం అసాధ్యాలను సుసాధ్యం చేసింది."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ నేతృత్వంలో రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం నూతన అధ్యాయాన్ని లిఖించిందని మోదీ పేర్కొన్నారు. కరోనా సమయంలోనూ రాష్ట్రంలో సమర్థంగా చర్యలు చేపట్టిందని చెప్పారు. 2017లో ఈ మహమ్మారి వచ్చి ఉంటే ఏమై ఉండేదని ప్రశ్నించారు. మణిపుర్​లో 10 మందిలో ఏడుగురికి ఉచిత రేషన్ అందుతోందని చెప్పారు. మణిపుర్ మహిళలు విదేశీ శక్తులకు వ్యతిరేకంగా పోరాడారాని అన్నారు. ఎన్​డీఏ ప్రభుత్వం మాత్రమే వారి సమస్యలను అర్థం చేసుకుందని, వారి జీవితాలను మెరుగుపర్చేందుకు ప్రయత్నించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అర్హులంతా ఓటేసేందుకు ముందుకు రావాలని మోదీ పిలుపునిచ్చారు. తొలిసారి ఓటేసే వ్యక్తులు, యువత ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు.

మణిపుర్​ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతల్లో జరగనున్నాయి. ఫిబ్రవరి 28, మార్చి 5న పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. మార్చి 10న ఫలితాలు విడుదల అవుతాయి.

ఇదీ చదవండి:'మాది అభివృద్ధి మంత్రం.. ఎస్పీది మాఫియావాదం'

ABOUT THE AUTHOR

...view details