PM Modi Inaugurates Development Works in Telangana : తెలంగాణలో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట్ విమానాశ్రయానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘనస్వాగతం లభించింది. ఎయిర్‌పోర్ట్‌లో గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎస్ శాంతికుమారి, ఎంపీలు బండి సంజయ్, సోయం బాపూరావుతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు మోదీకి స్వాగతం పలికారు. బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ప్రధాని.... సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడిచే వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు.
ఎంఎంటీఎస్ రెండో దశను ప్రారంభించిన ప్రధాని మోదీ : అనంతరం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి పరేడ్ మైదానానికి చేరుకున్న ప్రధాని మోదీ... అక్కడ ఏర్పాటు చేసిన సభావేదికపై నుంచి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ - సికింద్రాబాద్ జంటనగరాల సబర్బన్ పరిధిలో 13 కొత్త ఎంఎంటీఎస్ సర్వీసులను ప్రధాని ప్రారంభించారు. రెండోదశలో భాగంగా... మేడ్చల్-సికింద్రాబాద్-ఉందానగర్, మేడ్చల్ -సికింద్రాబాద్-తెల్లాపూర్ మధ్య ఈ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. అనంతరం బీబీ నగర్ ఎయిమ్స్ నూతన భవన సముదాయం నిర్మాణానికి ప్రధాని సభా వేదిక నుంచే వర్చువల్‌గా అంకురార్పణ చేశారు.