PM Modi in Gujarat: ప్రభుత్వ పథకాల లబ్ధిదారుడు, దృష్టిలోపంతో బాధపడుతున్న ఓ వ్యక్తి కుమార్తెతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గుజరాత్లోని భరుచ్ నగరంలో నిర్వహించిన 'ఉత్కర్ష్ సమారోహ్' కార్యక్రమంలో వర్చువల్గా హాజరై లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. మీ కుమార్తెలను ఉన్నత చదువులకు పంపిస్తారా? అని ఆ దివ్యాంగుడిని అడగగా.. తన ముగ్గురు కుమార్తెల్లో ఒకరు డాక్టర్ కావాలనుకుంటున్నట్లు తెలిపారు. వైద్య విద్యనే ఎందుకు ఎంచుకున్నావని అతడి కుమార్తెను మోదీ అడిగారు. దానికి 'నా తండ్రి పడుతున్న బాధను చూసి నేను డాక్టర్ కావాలని నిర్ణయించుకున్నా' అని సమాధానమిచ్చింది యువతి. ఆమె సమాధానం విన్న మోదీ కంటతడి పెట్టుకున్నారు. కొన్ని క్షణాల పాట మౌనంగా ఉండిపోయారు. నీ ప్రేమే నీ బలం అంటూ మెచ్చుకున్నారు.
వితంతువులు, వృద్ధులు, నిరాశ్రయులకు ఆర్థిక సాయం అందించే నాలుగు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు 100 శాతం లబ్ధిదారులకు అందుతున్న క్రమంలో.. 'ఉత్కర్ష్ సమారోహ్' కార్యక్రమాన్ని నిర్వహించింది భరుచ్ జిల్లా యంత్రాంగం. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ..'ప్రభుత్వ పథకాలు 100 శాతం ప్రజలకు చేరువవటం వల్ల వివక్షకు తెరపడింది. ఇప్పుడు వాటి ప్రయోజనాలు పొందేందుకు సిఫార్సులు అవసరం. అలాగే.. బుజ్జగింపు రాజకీయలకు సైతం ముగింపు పలికినట్లయింది. ప్రభుత్వ పథకాలపై సరైన అవగాహన లేకపోవటం వల్లే అవి కాగితంపైనే ఉండటం లేదా అర్హులు కాని వారు వాటి ప్రయోజనాలు పొందటం వంటివి జరుగుతున్నాయి.' అని మోదీ పేర్కొన్నారు.