PM Modi G20 Speech :పశ్చిమాసియాలో నెలకొన్న అస్థిరత, అభద్రతా వాతావరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రాంతీయ సంక్షోభంగా రూపుదాల్చకుండా చూడాల్సిన అవసరం ఉందని జీ-20దేశాల నేతలకు సూచించారు. బందీలను విడుదల చేయనున్నట్లు ఇజ్రాయెల్-హమాస్ చేసిన ప్రకటనను ప్రధాని మోదీ స్వాగతించారు. వర్చువల్‌గా జరిగిన జీ-20 దేశాల సదస్సులో ప్రారంభోపన్యాసం చేసిన ప్రధాని మోదీ... ఉగ్రవాదం ఆమోదయోగ్యం కాదన్నారు. పౌరుల మరణాలు ఎక్కడ జరిగినా ఖండించాల్సిందే అన్నారు. గత కొన్ని నెలల నుంచి కొత్త సవాళ్లు ఏర్పడినట్లు పేర్కొన్న ప్రధాని మోదీ... పశ్చిమాసియాలో నెలకొన్న అస్థిరత, అభద్రతా వాతావరణం ఆందోళన కలిగించే అంశంగా మారిందన్నారు.
"శాంతి కోసం పనిచేసే బలం ఒక కుటుంబంలో ఉంది. మానవ సంక్షేమం కోసం ఉగ్రవాదం, హింసకు వ్యతిరేకంగా మానవతను దృష్టిలో ఉంచుకొని గట్టిగా మన గళం వినిపించవచ్చు. ఈ ఆకాంక్షను నెరవేర్చేందుకు అందరితో కలిసి నడిచేందుకు భారత్ సిద్ధంగా ఉంది. 21వ శతాబ్దంలో ముందుకు సాగుతూ గ్లోబల్ సౌత్ సమస్యలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. గ్లోబల్ సౌత్‌లోని అనేక దేశాలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. వారికోసం బాధ్యతారాహిత్యంగా ఉండలేం. ఈ సందర్భంగా అభివృద్ధి అజెండాకు పూర్తి మద్దతు ప్రకటించాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, పాలనా నిర్మాణంలో పెద్ద, మెరుగైన, సమర్థ, ప్రాతినిథ్యంతో పాటు భవిష్యత్తుకు సన్నద్ధం చేసేందుకు సంస్కరణలు చేపట్టాల్సి ఉంది."
--నరేంద్రమోదీ, ప్రధానమంత్రి