PM Modi France Visit : ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిల సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ఫ్రాన్స్ పర్యటనకు బయలుదేరారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. శుక్రవారం ఫ్రాన్స్ జాతీయ దినోత్సవంలో గౌరవ అతిథిగా మోదీ పాల్గొననున్నారు. జులై 14న జరిగే బాస్టిల్ డే పరేడ్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందని.. గురువారం దిల్లీ నుంచి బయలుదేరే ముందు ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. అంతకుముందు ట్వీట్ చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్.. జులై 14న జరిగే బాస్టిల్ డే పరేడ్‌కు మోదీని అహ్వానించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు.
France Bastille Day Chief Guest : సాధారణంగా బాస్టిల్ డే పరేడ్ వేడుకలకు.. విదేశీ నేతలను ఆహ్వానించరు. చివరిసారిగా 2017లో బాస్టిల్ డే వేడుకలకు అమెరికా అధ్యక్షుడిని మాత్రమే ఆహ్వానించారు. ఆ తర్వాత ఇప్పటివరకు ఎవరినీ ఆహ్వానించలేదు. కానీ బాస్టిల్ డే వేడుకలకు భారత ప్రధానిని.. ఫ్రాన్స్ ఆహ్వానించడం ఇది రెండోసారి. 2009లో ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరవ్వగా.. ఇప్పుడు ప్రధాని మోదీ హాజరవుతున్నారు. బాస్టిల్ డే వేడుకలకు పదే పదే భారత ప్రధానులను ఆహ్వానించడాన్ని చూస్తే రెండు దేశాల మధ్య సంబంధాలు ఎంత దృఢంగా ఉన్నాయో తెలుస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Modi Macron Meeting : ఫ్రాన్స్ పర్యటనలో ప్రధాని మోదీ కీలక చర్చలు జరపనున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. సైనిక, వ్యూహాత్మక ఒప్పందాలు, ఉక్రెయిన్-రష్యా సంక్షోభం, ఇండో-పసిఫిక్ ప్రాంత పరిస్థితులపై ఇద్దరు నేతలు చర్చించే అవకాశం ఉంది. భారత నౌకా దళం కోసం 26 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుపై మోదీ కీలక ప్రకటన చేసే అవకాశముంది. విమాన వాహక నౌక INS విక్రాంత్ కోసం ఈ యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తున్నారు. ఈ మొత్తం డీల్ విలువ రూ. 90 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. వీటితోపాటు రక్షణ రంగంలో మరికొన్ని ఒప్పందాలను రెండు దేశాలు కుదుర్చుకునే అవకాశముంది. వీటిలోనే సాంకేతిక మార్పిడి కూడా ఉంది. స్కార్పీన్ జలాంతర్గాముల కోసం మళ్లీ ఆర్డరు పెట్టాలని భారత్‌ను ఫ్రాన్స్ కోరుతోంది. నౌకా దళం కోసం ఎన్‌హెచ్90 హెలికాప్టర్లను కూడా కొనుగోలు చేయాలని ఫ్రాన్స్ అడుగుతోంది. రక్షణ ఒప్పందాలతోపాటు కొన్ని వ్యూహాత్మక అంశాలు కూడా ఫ్రాన్స్, భారత్ మధ్య చర్చకు వచ్చే అవకాశముంది.
అంతర్జాతీయ జలాల్లో పెరుగుతున్న చైనా ప్రాబల్యంపై భారత్-ఫ్రాన్స్ ఆందోళనతో ఉన్నాయి. దక్షిణాసియాలో పరిస్థితిపై కూడా మోదీ, మేక్రాన్ చర్చించే అవకాశముంది. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం, అఫ్గానిస్తాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. భారత్‌తో కలిసి మల్టీ రోల్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్‌ను అభివృద్ధి చేయడానికి ఫ్రాన్స్ అంగీకరించింది. ఈ ఇంజిన్ల తయారీ ప్రక్రియను పూర్తిగా ఇండియాలోనే చేపట్టనున్నారు. ఈ మధ్య కాలంలో అమెరికాతో కుదిరిన GE-414 ఇంజిన్ డీల్ తరహాలోనే ఈ ఒప్పందం కూడా ఉండనుంది.
ఈ ఏడాదితో భారతదేశం- ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం 25వ వార్షికోత్సవానికి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో మోదీ ఫ్రాన్స్ పర్యటన కీలక మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. భారత్-ఫ్రాన్స్ ఇప్పటివరకు 35 కంటే ఎక్కువ వ్యూహాత్మక భాగస్వామ్యాలపై సంతకం చేశాయి.