PM Modi Flags Off Vande Bharat Express : దేశంలోని 9 నగరాల మధ్య మరో 5 వందేభారత్ సెమీ హైస్పీడ్ రైళ్లు ప్రారంభమయ్యాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో.. భోపాల్-ఇందోర్, భోపాల్-జబల్‌పుర్ వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. ధార్వాడ్-బెంగళూరు, రాంచీ-పట్నా, గోవా-ముంబయి వందేభారత్ రైళ్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభాయ్ పటేల్, సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, జ్యోతిరాదిత్య సింధియా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వందే భారత్ రైల్లో చిన్నారులతో ఆయన ముచ్చటించారు. వందేభారత్ రైళ్లతో.. మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, గోవాలకు రైలుప్రయాణం మరింత మెరుగవుతుందన్నారు.
Vande Bharat Opening Today : ఒకేరోజు ఐదు వందేభారత్ రైళ్లను ప్రారంభించటం ఇదే తొలిసారి అని రైల్వేశాఖ వర్గాలు తెలిపాయి. ఈ రైళ్లు మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు కనెక్టివిటీని పెంచుతాయని మోదీ ట్వీట్ చేశారు. మహాకాళేశ్వర్, ఖజురహో, సాత్పురా, భేర్ఘాట్ లాంటి పర్యటక ప్రాంతాలకు అనుసంధానతను పెంచుతుందని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.
అంతకుముందు మంగళవారం ఉదయం భోపాల్ ఎయిర్‌పోర్టు నుంచి రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌కు ప్రధాని హెలికాప్టర్‌లో రావాల్సి ఉండగా వాతావరణం అనుకూలించలేదు. దీంతో రోడ్డు మార్గం ద్వారా ఆయన స్టేషన్‌ను చేరుకున్నట్లు బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్‌ఛార్జ్ ఆశిష్ అగర్వాల్ తెలిపారు. ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్‌లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఒకేసారి రెండు వందే భారత్ రైళ్లను ప్రారంభించడం ప్రాధాన్యం సంతరించుకుంది.