Modi flags off Kisan Drones: డ్రోన్ రంగంలో పెరుగుతున్న భారత సామర్థ్యాలు ప్రపంచానికి సరికొత్త నాయకత్వాన్ని అందిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. పొలాల్లో పురుగుల మందులు, ఎరువులు పిచికారీ చేసేందుకు ఉపయోగించే కిసాన్ డ్రోన్లను ఆయన ప్రారంభించారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఒకేసారి 100 కిసాన్ డ్రోన్లను ఆవిష్కరించారు. వర్చువల్‌గా జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా.. హరియాణాలోని మనేసర్ రైతులతో మోదీ మాట్లాడారు.
"ఇంతకు ముందు వరకు డ్రోన్లు సాయుధ బలగాలకు, శత్రువులతో పోరాడేందుకే అని ఉద్దేశం ఉండేది. ఇప్పుడు వ్యవసాయ రంగంలోనూ వాడుతున్నాం. ప్రస్తుతం దేశంలో 200 కంటే ఎక్కువగా డ్రోన్ల స్టార్టప్‌లు ఉన్నాయి. త్వరలో అవి 1000కి పెరుగబోతున్నాయి. భారతదేశంలో డ్రోన్ల మార్కెట్ అభివృద్ధి..యువతకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
గరుడ ఏరోస్పేస్ సంస్థ రాబోయే రెండు సంవత్సరాల్లో లక్షకుపైగా డ్రోన్లను తయారుచేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని ప్రధాని మోదీ తెలిపారు. గత కొన్నాళ్లుగా దేశంలో చేపట్టిన సంస్కరణలు యువతతో పాటు ప్రైవేటు రంగానికి బలం చేకూర్చాయని ఆయన అన్నారు.