PM Modi Fast For Prana Pratishtha : అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠనేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ 11 రోజుల పాటు దీక్ష చేస్తున్నారు. ఆ దీక్షలో భాగంగా ఉపవాసం చేస్తున్న మోదీ కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతున్నారని, నేలపై దుప్పటి కప్పుకుని నిద్రిస్తున్నారని సమాచారం. అంతే కాకుండా మోదీ 'గోపూజ' కూడా చేస్తున్నారని, గోవులకు ఆహారం ఇవ్వడం, అన్నదానం వంటి పలు రకాల కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నట్లు తెలుస్తోంది.
రామభక్తుడైన మోదీ గత కొన్ని రోజులుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లోని దేవాలయాలను సందర్శిస్తున్నారు. అందులో భాగంగా మాహారాష్ట్ర నాసిక్‌లోని రామ్‌కుండ్ శ్రీకాల రామ దేవాలయం, ఆంధ్రప్రదేశ్ లేపాక్షిలోని వీరభద్ర ఆలయం, కేరళలోని గురువాయుర్ ఆలయం, త్రిప్రయార్ శ్రీ రామస్వామి దేవాలయాలను దర్శించుకున్నారు. మరో రెండు రోజుల పాటు (జనవరి 20, 21) తమిళనాడులోని మరిన్ని ఆలయాలను ప్రధాని మోదీ సందర్శించనున్నారు. అయితే మోదీ సందర్శించే ఆలయాలకు శ్రీరాముడితో సంబంధం ఉందని తెలుస్తోంది.
గత కొన్ని రోజులుగా ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాలను సందర్శించడం, వివిధ భాషల్లో రామాయణం వినడం, భజనల్లో పాల్గొనడం చాలా ముఖ్యమైనదని, దాని ప్రభావం సాధారణ ప్రజలకు అర్థం కాదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 'ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్' అనే ఆయన విజన్‌కు అనుగుణంగా భారతీయ సామాజిక- సాంస్కృతిక భావనను బలోపేతం చేయాలని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నాయి. అందులో భాగంగానే దేవాలయాలను శుభ్రపరిచే కార్యక్రమాన్ని ప్రారంభించారని, తాను చెప్పింది ఆచరించి ప్రేరణగా నిలవడానికి నాసిక్‌లోని శ్రీ కాలరామ ఆలయాన్ని మోదీ స్వయంగా శుభ్రం చేశారని చెప్పాయి.