PM Modi Elections Victory Speech :మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం.. నిజాయతీ, పారదర్శకత, సుపరిపాలనలకు నిదర్శనమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ మూడు విజయాలు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్‌కు గ్యారంటీ ఇచ్చాయని తెలిపారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయదుంధబి మోగించిన నేపథ్యంలో దిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కార్యకర్తలనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసగించారు. కాషాయదళంపై ప్రేమను కురిపించినందుకుగానూ మూడు రాష్ట్రాల ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు.
తెలంగాణలోనూ బీజేపీకి మద్దతు లభించిందన్నారు ప్రధాని మోదీ. తప్పుడు హామీలు, గాల్లో మాటలను ఓటర్లు విశ్వసించలేదంటూ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. 'ఎన్నికల సమయంలో కులాల వారీగా దేశాన్ని విభజించేందుకు కొందరు ప్రయత్నించారు. పేపర్ లీక్, నియామకాల్లో కుంభకోణాలు ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణాల్లో అధికార పక్షాల ఓటమికి కారణమయ్యాయి. అవినీతిపరులకు అండగా నిలిచిన, తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు యత్నించినవారికి, 'ఘమండియా (అహంకారపూరిత)' కూటమికి.. ఈ విజయాలు స్పష్టమైన హెచ్చరిక. దర్యాప్తు సంస్థలపై ఆరోపణలు చేసినవారిని ప్రజలు తిరస్కరించారు. దేశ వ్యతిరేక శక్తులకు ఊతమిచ్చే రాజకీయాలకు పాల్పడొద్దు. అందరూ ఒక వేదికపైకి వస్తే.. మంచి ఫొటోలు, మీడియా ముఖ్యాంశాలు లభిస్తాయి. కానీ, ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేరు. మీ మార్గాలను సరిదిద్దుకోండి. లేకపోతే ప్రజలే మిమ్మల్ని బయటకు పంపుతారు' అని విపక్ష కూటమి 'ఇండియా' కూటమిపై ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. ప్రతికూల శక్తులన్నీ ఇప్పుడు ఏకతాటిపైకి వచ్చేందుకు యత్నిస్తాయని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.. వాటితో పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
తనవరకు కేవలం నాలుగే కులాలు (మహిళలు, యువత, రైతులు, పేదలు) ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఎన్నికల్లో వారంతా బీజేపీ పట్ల ఉత్సాహాన్ని ప్రదర్శించినట్లు చెప్పారు. అభివృద్ధి చెందిన భారత్‌ను చూడాలని కోరుకునే ప్రతి ఒక్కరూ బీజేపీ గెలుపులో తమ విజయాన్ని చూసుకుంటున్నట్లు తెలిపారు. తమ భద్రత, గౌరవానికి బీజేపీ మాత్రమే హామీ ఇవ్వగలదని మహిళలు విశ్వసిస్తున్నారన్నారు. దేశంలోని యువత అభివృద్ధిని మాత్రమే కోరుకుంటున్నారని, వారి ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసినవారిని తరిమికొట్టారని పేర్కొన్నారు.
ప్రధాని మోదీ ట్వీట్..
అంతకుముందు నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆ రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. దేశ ప్రజలు సుపరిపాలన, అభివృద్ధిపైనే విశ్వాసం ఉంచుతారని మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ఫలితాలు వెల్లడిచేస్తున్నాయని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. బీజేపీపై నమ్మకం ఉంచిన తల్లులు, సోదరీమణులు, కుమార్తెలు, యువ ఓటర్లకు తన కృతజ్ఞతలను తెలిపారు. మీ సంక్షేమం కోసం తాము చేస్తోన్న పనిని కొనసాగిస్తామని హమీ ఇచ్చారు. తెలంగాణతో తమ బంధం విడదీయరానిదని వెల్లడించారు. బీజేపీ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు మోదీ తెలియజేశారు.
బుజ్జగింపు, కుల రాజకీయాలకు గుడ్‌బై!
రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో భారతీయ జనతా పార్టీ ఘన విజయంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హర్షం వ్యక్తం చేశారు. బుజ్జగింపులు, కుల రాజకీయాల రోజులు ముగిసిపోయాయని ఇవాళ ఫలితాలు రుజువు చేశాయని అమిత్‌షా వివరించారు. నవీన భారతం పనిచేసే ప్రభుత్వాలకే పట్టంకట్టిందని స్పష్టం చేశారు.