'వరుసగా 2014, 2019.. రెండు సాధారణ ఎన్నికల్లోనూ భాజపా నిర్ణయాత్మక విజయాలు అందుకొంది. ప్రజలు రాజకీయ స్థిరత్వాన్ని కోరుకొంటున్నారని చెప్పేందుకు ఇది సంకేతం. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి స్థానాన్ని 'సంపాదించి.. సాధించిన' విజేత. దేశంలో ఎక్కువమంది కోరుకున్న నాయకుడిగా ఆయన ఎదిగారు. అదే మన్మోహన్‌సింగ్ విషయానికి వస్తే.. ఆయనకు సోనియాగాంధీ ఈ అవకాశం ఇచ్చారు' అని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం విడుదలైన తన ఆత్మకథ 'ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్, 2012 - 2017'లో పేర్కొన్నారు. గతేడాది మృతిచెందిన ప్రణబ్ ముఖర్జీ తన మరణానికి కాస్తముందుగా ఈ ఆత్మకథను పూర్తి చేశారు. '2014 ఎన్నికల తీర్పు రెండు కారణాల రీత్యా చరిత్రాత్మకం. మొదటిది.. మూడు దశాబ్దాల తర్వాత ఓ పార్టీ సంపూర్ణ మద్దతుతో నిర్ణయాత్మక విజయం సాధించింది.
నిజమైన విజేత ఓటరే..
ఇక రెండోది.. తొలిసారి భాజపా లోక్‌సభలో కావలసిన మెజారిటీ ఏక పార్టీగా సాధించినా మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ, 'నిజమైన విజేత ఎవరంటే స్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకొన్న ఓటరే. అభివృద్ధిని కోరుకునే రాజకీయాలకు ఇది సూచిక' అని కాంగ్రెస్ వృద్ధనేత తన పుస్తకంలో విశ్లేషించారు. ప్రజలు కూడా సంకీర్ణాలతో అప్పటికే విసిగిపోయారని, దేశంలో సంకీర్ణాల ఏకైక ఎజెండా కేవలం ఒక పార్టీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే అన్నట్టు పరిస్థితులు మారాయన్నారు. '2014లో మోదీ ప్రభంజనాన్ని అడ్డుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైంది. ఎన్నికల ప్రచారం ముగిసి, సాధారణ పరిస్థితులు నెలకొన్నాక చాలామంది ముఖ్యులైన కాంగ్రెస్ నేతలు, మంత్రులు రాష్ట్రపతి భవన్‌లో వివిధ కారణాలతో నన్ను కలిశారు. ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే.. వారిలో ఒక్కరు కూడా యూపీఏకు స్పష్టమైన మెజారిటీ వస్తుందని చెప్పలేకపోయారు' అని ప్రణబ్ దా వివరించారు.