తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆయన ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తారు'.. ధన్​ఖడ్​పై ప్రధాని ప్రశంసలు - ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌

రాజ్యసభ ఛైర్మన్‌గా తొలిసారి బాధ్యతలు చేపట్టిన ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌కు దేశంతో పాటు ఉభయ సభల తరఫున శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి మోదీ. దేశంలో ఎంతో మందికి ఆయన స్ఫూర్తి అని జగదీప్​ను కొనియాడారు.

PM Modi congratulates Jagdeep Dhankhar
PM Modi congratulates Jagdeep Dhankhar

By

Published : Dec 7, 2022, 12:30 PM IST

Parliament Winter Session 2022 : రాజ్యసభ ఛైర్మన్‌గా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌.. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తారని ప్రధాని మోదీ అన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల మొదటి రోజు సభ సమావేశమైన వేళ.. రాజ్యసభ ఛైర్మన్‌గా తొలిసారి బాధ్యతలు నిర్వహిస్తున్న జగదీప్‌ ధన్‌ఖడ్‌కు దేశంతో పాటు సభ తరఫున ప్రధాని శుభాకాంక్షలు చెప్పారు. దేశంలో ఎంతో మందికి ఆయన స్ఫూర్తి అని కొనియాడారు. అనేక బాధ్యతలను ధన్‌ఖడ్‌ సమర్థంగా నిర్వర్తించారని.. రైతుబిడ్డ ఉపరాష్ట్రపతిగా ఎన్నికవడం సంతోషించదగ్గ విషయమన్నారు. న్యాయవాదిగా మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న ధన్‌ఖడ్‌కు.. న్యాయ పరమైన విషయాలపై గొప్ప పరిజ్ఞానం ఉందన్నారు. భారత్‌ అమృత్ కాల్ ప్రయాణం.. జీ20 దేశాల అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సమయంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని ప్రధాని గుర్తు చేశారు. అనంతరం ఇటీవల కన్నుమూసిన సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌, ప్రముఖ తెలుగు నటుడు, మాజీ ఎంపీ ఘట్టమనేని కృష్ణకు రాజ్యసభలో నివాళులర్పించారు. అటు లోక్‌సభలోనూ వీరికి నివాళులర్పించిన అనంతరం దిగువసభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.

పార్లమెంట్​లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ

"మన ఉప రాష్ట్రపతి రైతు పుత్రులు. అంతేకాక సైనిక్ పాఠశాలలో చదువుకున్నారు. అందువల్ల జవాన్లు, రైతులతో ఆయనకు సన్నిహిత సంబంధం ఉంది. ఈ అపూర్వమైన సమయంలో ఈ ఎగువ సభకు మీలాంటి ప్రభావవంతమైన వ్యక్తి నేతృత్వం లభించింది. మీ మార్గదర్శకత్వంలో సభలోని సభ్యులందరూ వారి విధులను సక్రమంగా నిర్వహిస్తారు. దేశ ప్రజల సంకల్పాన్ని ఈ సభ పూర్తి చేసేందుకు పాటుపడుతుంది. గిరిజన సమాజానికి చెందిన మన గౌరవనీయ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాకు ఇప్పటికే మార్గదర్శనం చేస్తున్నారు. అంతకుముందు కూడా అట్టడుగు వర్గానికి చెందిన రామ్‌నాథ్‌ కోవింద్‌ దేశ అత్యున్నత పదవిని అలంకరించారు. ఇప్పుడు కిసాన్‌ పుత్రులైన మీరు కూడా కోట్లాది మంది పేదలు, రైతుల ఉన్నతికి ప్రతినిధిగా ఉన్నారు."

నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ఈ సమావేశాలు ఈనెల 29 వరకు కొనసాగనున్నాయి. మొత్తం 23 రోజుల వ్యవధిలో ఉభయ సభలు 17 దఫాలు భేటీకానున్నాయి. ఈ సమావేశాల్లో 16 కొత్త వాటితో సహా 25 బిల్లులకు పార్లమెంటు ఆమోదం పొందాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుండగా.. కీలకమైన మూడు బిల్లులను స్థాయీ సంఘం పరిశీలనకు పంపించాలని కాంగ్రెస్‌ పార్టీ పట్టుబట్టనుంది. దీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళల రిజర్వేషన్‌ బిల్లుకు మోక్షం కల్పించాలని పలు పార్టీలు డిమాండ్‌ చేసే అవకాశముంది.

జగదీప్‌ ధన్‌ఖడ్‌
సమావేశంలో మెంబర్లు

ABOUT THE AUTHOR

...view details