PM Modi in UP: ప్రపంచంలోని ప్రతిఒక్కరిని ప్రభావితం చేసే అంతర్జాతీయ సవాళ్లను దృష్టిలో ఉంచుకుని భారత్ మరింత శక్తిమంతంగా తయారు కావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహరాజ్‌గంజ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అతిపెద్ద రాష్ట్రంగా.. భారత్‌ను బలంగా తయారు చేయటంలో యూపీదే కీలక బాధ్యతని పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు వైబ్రెంట్ విలేజ్ పేరుతో సరికొత్త పథకాన్ని కేంద్రం ప్రారంభించినట్లు చెప్పారు.
"ప్రస్తుతం ప్రపంచాన్ని చాలా సవాళ్లు పీడిస్తున్నాయి. ఏదో ఒక విధంగా ప్రపంచంలోని ప్రతి ఒక్కరిపై ఆ ప్రభావం పడుతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో భారత్ మరింత శక్తిమంతంగా తయారు కావాల్సిన అవసరం ఉంది. వ్యవసాయం నుంచి సైన్యం, సముద్రం నుంచి అంతరిక్షం వరకు ప్రతి రంగంలో భారత్ ప్రబలశక్తిగా ఎదగాలి."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.