India Christmas celebration: దేశవ్యాప్తంగా క్రిస్మస్ సందడి నెలకొంది. చర్చిలు కళకళలాడుతున్నాయి. ఈ సందర్భంగా.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్.. దేశ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
"దేశ, విదేశీ ప్రజలకు, క్రిస్టియన్ సోదరులు, సోదరీమణులకు శుభాకాంక్షలు. న్యాయం, స్వేచ్ఛతో సాగిన జీసస్ బోధనలకు అద్ధం పట్టే విధంగా సమాజాన్ని నిర్మిచాలని ఈ రోజున మనం ప్రతిజ్ఞ తీసుకుందాం."
--- రామ్‌నాథ్ కొవింద్, రాష్ట్రపతి.
PM Modi Christmas wishes: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా.. దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
"అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. సేవ, మానవత్వం, దయతో కూడిన ప్రభువు బోధనలను ఈ సందర్భంగా గుర్తుచేసుకుందాం. అందరు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. సమాజం సామరస్యంతో వర్థిల్లాలని కోరుకుంటున్నాను."
-- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
వేడుకలు ఇలా..
కర్ణాటక బెంగళూరులోని సెయింట్ ఫ్రాన్సిస్ చర్చిలో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. పుదుచ్చేరిలో పెద్ద ఎత్తున భక్తులు అర్ధరాత్రి నుంచే చర్చిలకు విచ్చేశారు.
హిమాచల్‌ప్రదేశ్‌లో స్థానికులతో పాటు విదేశీ పౌరులు సైతం చర్చిలలో ప్రార్థనలు చేశారు. ధర్మశాలలోని వైల్డర్నెస్ చర్చిలో బెల్జియం దౌత్యవేత్త ప్రార్థనలు చేశారు. 'ఇంటి నుంచి దూరంగా ఉన్న తమకు.. ఇక్కడి క్రైస్తవులతో కలిసి క్రిస్మస్ నిర్వహించుకోవడం సంతోషంగా ఉంద'ని ఆయన పేర్కొన్నారు.
బంగాల్లో సామూహిక ప్రార్థనలు జరిగాయి. కోల్‌కతాలోని సెయింట్ థెరిసా చర్చిలో నిర్వహించిన ప్రార్థనలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
దిల్లీలో మాత్రం క్రిస్మస్ వేడుకలపై కరోనా ప్రభావం పడింది. ఆంక్షల నేపథ్యంలో చర్చిలలోకి ఎవరినీ అనుమతించలేదు. చాందినీ చౌక్‌లోని బాప్టిస్ట్ చర్చి, గోల్ మార్కెట్లోని సేక్రడ్ హార్ట్ కేథడ్రల్ చర్చిలను మూసేశారు. అయితే, కొంతమంది భక్తులు చర్చి బయట ప్రార్థనలు చేసుకున్నారు.
మహారాష్ట్రలోనూ ఆంక్షల మధ్య క్రిస్మస్ వేడుకలు జరిగాయి. చర్చిల సామర్థ్యంలో 50శాతం వరకే అనుమతించాలని మహారాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో.. పరిమిత సంఖ్యలోనే భక్తులు హాజరయ్యారు.
ఇదీ చూడండి:-క్రిస్మస్ ప్రయాణాలపై ఒమిక్రాన్ దెబ్బ.. వందల విమానాలు రద్దు