దేశంలో మెడికల్ ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆక్సిజన్ సరఫరా పెంపుపై అధికారులతో సమావేశమయ్యారు. ఆక్సిజన్, వైద్య పరికరాలు అందుబాటులో ఉంచేందుకు అన్ని మంత్రిత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని మోదీ సూచించారు.
సరఫరా పెంచేందుకు.. ఆక్సిజన్, సంబంధిత పరికరాలపై కస్టమ్స్ డ్యూటీ మినహాయిస్తూ ఈ సమావేశంలో ప్రధాని నిర్ణయం తీసుకున్నారు. ఈ పరికరాల దిగుమతిపై మూడు నెలల పాటు కస్టమ్స్ డ్యూటీ, హెల్త్ సెస్‌ను మినహాయిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని పేర్కొంది. దిగుమతి చేసుకునే వ్యాక్సిన్లపైనా కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది.
ఈ నిర్ణయం వివిధ పరికరాల ధర తగ్గేందుకు దోహదం చేస్తుందని మోదీ పేర్కొన్నారు. ఆక్సిజన్ సంబంధిత పరికరాల దిగుమతికి వెంటనే అనుమతులు ఇవ్వాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు. మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ సరఫరాను పెంచాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు. ఆస్పత్రులతో పాటు ఇంట్లో చికిత్స పొందుతున్న రోగులకు కావాల్సిన వైద్య పరికరాలు అందుబాటులో ఉంచాలని దిశానిర్దేశం చేశారు.
కేంద్రం నిర్ణయంతో.. ఆక్సిజన్ నిల్వ ట్యాంకులు, సిలిండర్లు, ఫిల్లింగ్ వ్యవస్థలు సహా సంబంధిత పరికరాల దిగుమతి మరింత సులభతరం కానుంది.