PM Modi Celebrates Diwali With Jawans : ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకొన్నారు. ఇందుకోసం ఆదివారం హిమాచల్ ప్రదేశ్‌లోని చైనా సరిహద్దైన లెప్చాకు చేరుకున్న ఆయన.. జవాన్లతో కలిసి పండగ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ మేరకు లెప్చాలో సైనికులతో మాట్లాడుతున్న పలు చిత్రాలను ఆయనే స్వయంగా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మిలిటరీ దుస్తులు, టోపీ ధరించిన మోదీ.. సైనికులతో ముచ్చటించారు.
'మీరుండే చోటే నాకు అయోధ్య..'
జవాన్లతో మాట్లాడిన అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ఓ సభలో ప్రసంగించారు మోదీ. 'నేను ప్రతి సంవత్సరం వచ్చి మా ఆర్మీ సిబ్బందితో దీపావళి పండగను జరుపుకుంటున్నాను. శ్రీ రాముడు ఉన్న స్థలాన్ని అయోధ్య అని అంటారు. కానీ, నా దృష్టిలో భరతమాత రక్షణ కోసం అహర్నిశలు కష్టపడుతున్న మన భద్రత దళాలు ఉండే చోటునే నేను అయోధ్యగా పిలుస్తాను. గత 30-35 సంవత్సరాలుగా నేను మీ(ఆర్మీ)తో దీపావళిని జరుపుకోని ఏడాది లేదు. నేను ప్రధాని, సీఎం హోదాల్లో లేనప్పుడు కూడా మన దేశ సరిహద్దుల్లోని జవాన్లతో దీపావళి పండగను జరుపుకున్నాను' అని మోదీ వ్యాఖ్యానించారు.
"మన భద్రతా బలగాల ధైర్యం వెలకట్టలేనిది. తమ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ ఎంతో కష్టతరమైన ప్రాంతాల్లో పహారా కాస్తుంటారు. వారి త్యాగం, దేశం పట్ల అంకితభావం వలనే మనం సురక్షితంగా జీవించగలుగుతున్నాము. ధైర్యంతో శత్రువుల నుంచి మనల్ని కాపాడుతున్న వీరులకు భారతదేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది."
- నరేంద్ర మోదీ, భారత ప్రధాని