ప్రపంచ విచ్ఛిన్నం అవుతున్న సమయంలో ఈ జీ20 సదస్సు జరుగున్నందున అన్ని దేశాల చూపు దీనిపైనే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనడానికి అన్ని దేశాలు మందుకు రావాలని మోదీ పిలుపునిచ్చారు. 'ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు' అనే నినాదంతో.. వసుధైక కుటుంబం అనే భావనతో జీ20 విదేశాంగ మంత్రుల సదస్సు భారత్లో ప్రారంభమైంది. మార్చి 1 నుంచి 4 వరకు జరుగుతున్న ఈ జీ20 సమావేశానికి హరియాణాలోని గురుగ్రామ్ వేదికైంది.
ఈ సదస్సులో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా పాల్గొన్న మోదీ.. ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంపై అన్ని దేశాలు ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. విభజించే వాటిపై కాకుండా.. అందరినీ కలిపే అంశాలపై దృష్టి కేంద్రీకరించాలని మోదీ కోరారు. ఈ విషయంలో గాంధీ, బుద్ధుడు జన్నించిన ఈ భారతదేశ నాగరికత నుంచి ప్రేరణ పొందాలని ప్రతినిధులకు మోదీ పిలుపునిచ్చారు. ఇటీవల ఎదురైన పలు సమస్యలపై స్పందించిన తీరు.. ప్రపంచ స్థాయి సంస్థల వైఫల్యాన్ని సూచిస్తోందని అన్నారు.
"ప్రపంచ దేశాలు విచ్ఛిన్నం అవుతున్న సమయంలో మనందరం కలుసుకున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక సంక్షోభం, కరోనా మహమ్మారి, ఉగ్రవాదం, యుద్ధాల వంటి వాటిని ఎదుర్కొనడంలో ప్రపంచ స్థాయి సంస్థలు విఫలమయ్యాయి. వివిధ దేశాల మధ్య ఏర్పడ్డ వివాదాలు, ఉద్రిక్తతలు ఎలా పరిష్కరించాలనే అనే దానిపై మనందరి ఆలోచనలు ఉన్నాయి. మనం కలిసి పరిష్కరించుకోలేని సమస్యలను మనం చేయగలిగిన వాటి దారిలోకి రానివ్వకూడదు. వృద్ధి, అభివృద్ధి, విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యం, ఆర్థిక స్థిరత్వం, అంతర్జాతీయ నేరాలు, అవినీతి వంటి సవాళ్లను తగ్గించడానికి ప్రపంచం ఇప్పుడు జీ20 దేశాల వైపు చూస్తోంది. ఈ అన్ని రంగాల్లో ఏకాభిప్రాయాన్ని పెంపొందిచడానికి, కచ్చితమైన ఫలితాలు సాధించగలిగే సామర్థ్యం జీ20కు ఉంది. ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న దేశాలు, ఈ గదిలో లేని వారి పట్ల మాకు కూడా బాధ్యత ఉంది."
-నరేంద్ర మోదీ, భారత ప్రధాని