తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆస్పత్రిలో మాస్క్​లు మస్ట్.. కరోనా కథ ముగియలేదు'.. ప్రధాని కీలక సూచనలు - కరోనా వైరస్ నివారణపై ప్రధాని మోదీ సూచనలు

దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కొవిడ్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు కీలక సూచనలు చేశారు.

modi cabinet meeting today on corona situtation in india
భారత్​లో కరోన కేసులపై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష

By

Published : Mar 22, 2023, 7:39 PM IST

Updated : Mar 22, 2023, 10:09 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అలాగే అన్ని రాష్ట్రాలను కొవిడ్​ వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆస్పత్రుల్లో రోగులు, వైద్యులు, ఇతర సిబ్బంది మాస్క్​ ధరించడం వంటి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్న వారు రద్దీగా ఉన్న ప్రాంతాలకు వెళ్లినప్పుడు మాస్క్​ తప్పనిసరిగా వాడాలని.. ప్రతిఒక్కరూ వ్యక్తిగత శుభ్రతను పాటించాలని సలహా ఇచ్చారు. దేశంలో కరోనా కేసులు, ఇన్​ఫ్లుయెంజా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కొవిడ్ కేసుల కట్టడి కోసం తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు.

కరోనా ఇంకా ముగియలేదు..: ప్రధాని మోదీ
కరోనా కథ ఇంకా ముగియలేదని మోదీ వ్యాఖ్యానించారు. అందరూ అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిన అవసరముందని అధికారులకు గుర్తుచేశారు. టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్-మాస్క్​ ధరించడం వంటి జాగ్రత్తలు పాటించడం-ల్యాబ్ టెస్టింగ్ అనే ఐదు అంచెల వ్యూహాన్ని అమలు చేయాలని సూచించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని నిర్ధరించుకునేందుకు ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని సంబంధిత శాఖల అధికారులకు మోదీ నిర్దేశించారు. ఏమైనా కొత్త వేరియంట్లు వ్యాప్తి చెందుతున్నాయేమో గుర్తించేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ లేబొరేటరీల సంఖ్యను పెంచాలని ప్రధాని సూచించారు.

ఈ సమావేశంలో భారతదేశంలో పెరుగుతున్న కేసులతో సహా ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్-19 పరిస్థితిని విశ్లేషిస్తూ ఒక సమగ్రమైన ప్రదర్శనను కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రదర్శించారు. అయితే 2023 మార్చి 22 వరకు దేశంలో సగటును 888 రోజువారీ కరోనా కేసులు.. ప్రపంచవ్యాప్తంగా సగటున 1.08 లక్షల రోజువారీ కేసులు నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు.

చివరిసారిగా 2022 డిసెంబరు 22న జరిగిన కొవిడ్-19 సమీక్షలో ప్రధానమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు తీసుకున్న చర్యల గురించి వివరించారు అధికారులు. ప్రధానమైన 20 రకాల కొవిడ్ డ్రగ్స్, 12 రకాల ఇతర ఔషధాల లభ్యత వాటి ధరలతో పాటు ఇన్​ఫ్లూయెంజాకు సంబంధించిన ఔషధాల వివరాలను కూడా ప్రధానికి తెలిపారు. ముఖ్యంగా దేశంలో గత కొన్ని నెలలుగా ఇన్​ఫ్లూయెంజా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దాని పరిస్థితిని ప్రధానికి వివరించారు అధికారులు. ఇక కేసుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలని అధికారులను ఆదేశించారు మోదీ. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఆస్పత్రుల్లో సరిపడా బెడ్స్​ ఉండాలని.. వైద్య సిబ్బందితో పాటు మౌలిక సదుపాయాలు ఉండేలా చూసుకోవాలని సూచించారు.

ఒక్కరోజులో 1134 కొవిడ్​ కేసులు..
మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా మొత్తం 1,03,831​ పరీక్షలు నిర్వహించగా 1,134 మంది కొవిడ్ బారిన పడ్డారని నిర్ధరణ అయింది. ప్రస్తుతం యాక్టివ్​ కేసుల సంఖ్య 7,026కు పెరిగింది. కొవిడ్ కారణంగా మంగళవారం దేశవ్యాప్తంగా ఐదుగురు మరణించారు. మరణించిన వారిలో ఛత్తీస్​గఢ్​, దిల్లీ, గుజరాత్​, మహారాష్ట్రతో పాటు కేరళలో ఒక్కో మరణం సంభవించినట్లుగా ఆరోగ్య శాఖ పేర్కొంది. దీంతో భారత్​లో మరణాల సంఖ్య 5,30,813కి చేరింది. దేశంలో రోజూవారీ కొవిడ్​ పాజిటివిటీ శాతం 1.09, వారం పాజిటివిటీ రేట్​ 0.98 శాతంగా ఉంది. ఇక ఇప్పటివరకు దేశంలో కొవిడ్​ నిర్ధరణ అయిన వారి సంఖ్య 4.46 కోట్లుగా ఉంది. రికవరీ రేటు 98.79 శాతం. యాక్టివ్​ కేసులు 0.02 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాజాగా నిర్వహించిన పరీక్షలతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కొవిడ్ టెస్ట్​ చేసుకున్న వారు 92.05 కోట్లుగా ఉన్నారు. కొవిడ్​ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,60,279గా ఉంది. మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. ఇకపోతే అధికారిక లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్​లో భాగంగా మొత్తం 220.65 కోట్ల కొవిడ్​ వ్యాక్సిన్​లను పంపిణీ చేశారు.

Last Updated : Mar 22, 2023, 10:09 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details