మంత్రివర్గ విస్తరణ(Cabinet Expansion) ప్రధానమంత్రి విచక్షణాధికారం! ఆ విచక్షణను బుధవారంనాడు దాదాపు పూర్తిస్థాయిలో ప్రదర్శించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ! అనూహ్యంగా 12 మంది మంత్రులపై.. అదీ రవిశంకర్‌ప్రసాద్, హర్షవర్ధన్, ప్రకాశ్ జావడేకర్‌లాంటి సీనియర్‌నేతలపైనా వేటు, ఓబీసీలకు పెద్దపీటలాంటి నిర్ణయాలు భాజపాలోనూ చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇంతకూ ప్రధాని మోదీ తన మంత్రివర్గ విస్తరణతో ఏం సందేశం ఇవ్వాలనుకున్నారు? ఈ మార్పులతో ఆయనేం ఆశిస్తున్నారేది ఆసక్తికరాంశంగా మారింది!
రాజకీయంగా సరికొత్త ముద్ర..
వరుసగా రెండుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చినా.. వివిధ రాష్ట్రాల్లో గెలుస్తున్నా.. ఇప్పటిదాకా భాజపాపై అగ్రవర్ణముద్ర పోలేదు. తొలిసారిగా కేంద్రమంత్రివర్గంలో మోదీ 30శాతం మంది ఓబీసీలకు చోటు కల్పించారు. ఎస్సీ, ఎస్టీలను కలుపుకొంటే.. 50శాతంపైగా (ఓబీసీలు 27, దళితులు 12, ఆదివాసీలు 8, మహిళలు 11) ఈ వర్గాల నుంచి ప్రాతినిధ్యం లభించింది. ఇది భాజపాలో కొత్త సామాజిక విధానపరమైన మార్పుగా అభివర్ణిస్తున్నారు. తద్వారా పార్టీ అన్ని వర్గాలకు దగ్గరయ్యేందుకు దోహదం చేస్తుందని భావన. వచ్చే ఏడాది రాబోయే ఉత్తర్‌ప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో, ఇటీవలే గణనీయంగా సీట్లు సాధించిన బెంగాల్‌లో పట్టు పెంచుకునేందుకు ఈ సమీకరణాలు ఉపయోగపడతాయని భాజపా భావిస్తోంది. యూపీ, బిహార్‌లాంటి చోట్ల ఓబీసీల ఓట్లు చాలా కీలకం!
పాలనపై పట్టుకు..
రెండో దఫా అధికారంలోకి వచ్చాక రెండేళ్లుగా నరేంద్రమోదీ పాలనతీరుపై విమర్శలు చెలరేగుతున్నాయి. కొవిడ్ సందర్భంలో వివిధ శాఖల మధ్య సమన్వయలోపంపై పార్టీలోనూ అంతర్గతంగా అసంతృప్తి ఉంది. గతంలో సీనియర్ నేతలనే పేరుతో చాలామందికి కీలకమైన శాఖలిచ్చారు. కానీ వారి పనితీరు సరిగ్గా లేకపోవటం; పదేపదే ఆ శాఖల్లో వివాదాలు, ప్రభుత్వ ప్రతిష్ఠ మసకబారటం వల్ల పాలనకు కొత్త రూపునివ్వాలని మోదీ భావించినట్లు కన్పిస్తోంది. అందుకే.. సమర్థంగా పనిచేయటం లేదని భావించిన హర్షవర్ధన్, రవిశంకర్, పోఖ్రియాల్‌లాంటి సీనియర్లను సైతం పక్కనబెట్టారు. సైకిల్‌పై పార్లమెంటుకు వస్తారని ప్రచారంలోకి వచ్చిన సారంగిని సైతం పంపించేశారు. కొవిడ్ విషయంలో ఆరోగ్యశాఖ మంత్రి పనితీరుపై ఇంటాబయటా విమర్శలు వ్యక్తమయ్యాయి. పని చేయకుంటే.. సీనియర్లైనా వేటే అనే సందేశం స్పష్టంగా ఇచ్చారు. యువతరానికి, విద్యాధికులకు, మాజీ బ్యూరోక్రాట్లకు, మహిళలకు పెద్దపీట వేస్తూ తన కేబినెట్ రూపు మార్చారు. 36 మంది కొత్తవారిలో చాలామందికి సహాయ మంత్రి పదవులిచ్చి.. కేబినెట్‌లోకి మాత్రం అనుభవజ్ఞులను, మాజీ ఐఏఎస్‌లను, మాజీ ముఖ్యమంత్రులను తీసుకున్నారు. ఎలాంటి పాలనానుభవం లేకుండా కేబినెట్‌లోకి వచ్చింది ఒక్క భూపేందర్ యాదవ్ మాత్రమే. అంతేగాకుండా.. ఇబ్బందులు లేకుండా ఉండేలా శాఖల కూర్పులో సైతం మార్పులు తెస్తున్నారు. మొత్తానికి 2024 ఎన్నికల నాటికి పాలనపరంగా సమర్థంగా పేరు తెచ్చుకోవాలనేది లక్ష్యంగా కనిపిస్తోంది.
కొత్త నాయకత్వానికి బాటలు..