అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. మహిళల చేతుల్లో నడుస్తున్న సంస్థలకు చెందిన ఉత్పత్తులను కొనుగోలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. మహిళల సృజనాత్మకత భారత సంస్కృతిని పెంపొందిస్తుందన్న మోదీ.. 'ఆత్మ నిర్భర్' భారత్‌లో వారు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో దేశంలో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని సూచించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ ఈ మేరకు తాను కొనుగోలు చేసిన వస్తువులను ట్విట్టర్లో పంచుకున్నారు మోదీ. దీనికి 'నారీ శక్తి' అనే హ్యాష్ ట్యాగ్‌ను జోడించారు.
ఎంబ్రాయిడరీ శాలువా..
తమిళనాడులోని తోడా తెగకు చెందిన చేనేత కార్మికులు నేసిన ఎంబ్రాయిడరీ శాలువా అద్భుతంగా ఉందని చెప్పారు ప్రధాని. ఈ ఉత్పత్తులను ట్రైబ్స్ ఇండియా మార్కెట్ విక్రయిస్తోందని ఆయన పేర్కొన్నారు.
పేపర్ పెయింటింగ్..
గోండ్ పేపర్ పెయింటింగ్ గిరిజన ప్రాంతాల వారు హస్తకళతో చేసిన పేపర్ పెయింటింగ్‌ను కొన్నట్టు కూడా మోదీ చెప్పారు. దీన్నే గోండ్ పెయింటింగ్ అంటారని.. ఇది వారి అద్భుతమైన సృజనాత్మకతకు నిదర్శనమని కొనియాడారు.
నాగ శాలువా..
సంప్రదాయ నాగ శాలువాను కొనుగోలు చేసినట్టు ట్వీట్ చేశారు మోదీ. ఇది ధైర్యం, కరుణ, సృజనాత్మకతలకు ప్రతీకగా నిలవడం సహా.. దేశానికి గర్వకారణం అని చెప్పారు.
ఖాదీ కాటన్ మధుబని స్టోల్..
ఖాదీ కాటన్ మధుబని స్టోల్ మహాత్మాగాంధీతో పాటు దేశ చరిత్రలో ప్రత్యేక స్థానం 'ఖాదీ'కి ఉందన్న మోదీ.. ఖాదీ కాటన్ మధుబని పెయింటెడ్ స్టోల్‌ను కొన్నట్టు తెలిపారు. ఇది అత్యుత్తమ నాణ్యత కలిగి ఉందన్న ఆయన.. దేశ పౌరుల సృజనాత్మకతకు ఇది నిదర్శనమన్నారు.
ఫైల్ ఫోల్డర్..
దస్తావేజులు, పత్రాలు వంటివి భద్రపరచుకునేందుకు.. బంగాల్ వాసుల చేతితో తయారు చేసిన జనపనారతో కూడిన ఫైల్ ఫోల్డర్‌ను వాడనున్నట్టు మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రతిఒక్కరూ బంగాల్ జనుము వస్తువును కలిగి ఉండాలని ఆయన సూచించారు. అక్కడి గిరిజనులు వీటిని తయారు చేస్తారు.
గమూసా..
ఇక.. తాను అధికంగా ధరించే గమూస(శాలువా)ను ప్రజలు చూస్తుంటారన్న మోదీ.. వీటిని కాకతిపపుంగ్ డెవలప్మెంట్ బ్లాక్‌లోని సహాయక బృందం తయారు చేస్తుందని వివరించారు. చాలా సౌకర్యంగా ఉండే దీనిని తాను కొనుగోలు చేసినట్టు తెలిపారు.
క్లాసిక్ పామ్ క్రాఫ్ట్ నీలవిలక్కు..
కేరళ మహిళలు రూపొందించిన క్లాసిక్ పామ్ క్రాఫ్ట్ నీలవిలక్కు(ప్రతిమ)ను తీసుకున్నట్టు మోదీ చెప్పారు. దీన్ని వినియోగించేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఉన్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా అక్కడి నారీ శక్తి హస్తకళా నైపుణ్యాన్ని ప్రశంసించారు.
ఇదీ చదవండి:మహిళల విజయాలతో భారత్ గర్విస్తోంది: మోదీ