తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉక్రెయిన్ ఉద్రిక్తతలు.. రాష్ట్రపతిని కలిసిన మోదీ.. భారత పౌరులకు అలర్ట్​ - Pm meet President

PM Modi: ఉక్రెయిన్​ పరిణామాల గురించి రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​కు వివరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారత పౌరులను స్వదేశానికి తరలించే ప్రక్రియ గురించి ఆయనతో చర్చించారు. మరోవైపు ఈ ప్రక్రియ కోసం కేంద్ర ప్రభుత్వం వాయుసేనను రంగంలోకి దించుతున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. ఉక్రెయిన్​ రాజధాని కీవ్​లోని భారత పౌరులు.. తక్షణమే ఆ నగరాన్ని విడిచి వెళ్లాలని కేంద్రం సూచించింది.

PM Modi
Ukraine crisis

By

Published : Mar 1, 2022, 12:44 PM IST

Updated : Mar 1, 2022, 12:52 PM IST

PM Modi: ఉక్రెయిన్​ సంక్షోభం సహా పలు అంశాలపై రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ను కలిసి స్వయంగా వివరించారు ప్రధాని నరేంద్ర మోదీ. 'ఆపరేషన్​ గంగ' పేరిట ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారత పౌరులను స్వదేశానికి రప్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం. వారిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు. ఈ తరలింపు ప్రక్రియలో తాము చేపడుతున్న చర్యల గురించి రాష్ట్రపతికి మోదీ వివరించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

మోదీ సమక్షంలో రాష్ట్రపతి భవన్​లో మంగళవారం ఆరోగ్య వనాన్ని ప్రారంభించారు కోవింద్. ఆయుర్వేద మొక్కల ప్రాముఖ్యత, మానవ అవయవాలపై వాటి ప్రభావం గురించి అవగాహన, ప్రచారం కల్పించే ఉద్దేశంతో దీనిని రూపొందించారు. దానిని ప్రజల సందర్శనకు పెట్టారు.

రాష్ట్రపతితో ప్రధాని మోదీ

రంగంలోకి వాయుసేన..

ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఏర్పాటు చేసిన ఆపరేషన్​ గంగను వేగవంతం చేసేందుకు వాయుసేన రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

వాయుసేనకు చెందిన సీ-17 ఎయిర్​ క్రాఫ్ట్​ను ఇందుకు వినియోగించనున్నారు. దీని ద్వారా తక్కువ సమయంలో మరింత మందిని తరలించేందుకు వీలవుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

తక్షణమే కీవ్​ను వీడండి..

ఉక్రెయిన్​ రాజధాని కీవ్​లోని భారత పౌరులు.. తక్షణమే ఆ నగరాన్ని విడిచివెళ్లాలని సూచించింది కేంద్ర ప్రభుత్వం. అందుబాటులో ఉన్న రైళ్లు, ఇతర సౌకర్యాలతో కీవ్​ను ఖాళీ చేయాలని స్పష్టం చేసింది.

కీవ్ లక్ష్యంగా రష్యా దూకుడు పెంచింది. 65 కిలోమీటర్ల మేర సాయుధ కాన్వాయ్​ను మోహరించింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం కీలక సూచనలు చేసింది.

మరో 182 మంది భారత్​కు..

182 మంది భారతీయులతో ఏడో విమానం రొమేనియా రాజధాని బుకారెస్ట్​ నుంచి సోమవారం బయలుదేరిన విమానం ఈ ఉదయం ముంబయి చేరుకుంది. మరో రెండు విమానాలు కూడా అక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 6 విమానాల్లో 1396 మందిని స్వదేశానికి తీసుకొచ్చారు.

మనమే ముందున్నాము..

ఉక్రెయిన్​లో చిక్కుకున్న పౌరులను స్వదేశానికి తరలించే ప్రక్రియలో అన్ని దేశాలతో పోలిస్తే భారత్​ చురుకుగా పనిచేస్తోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో ఈ మేరకు బదులిచ్చింది. "పౌరుల తరలింపు ప్రక్రిను చైనా వాయిదా వేసింది. అమెరికా కూడా తమ పౌరులను తరలించలేమని ప్రకటించింది. అయినా ఆపరేషన్​ గంగ నిరంతరంగా కొనసాగుతోంది." అని ప్రభుత్వ వర్గాలు పేర్కోన్నాయి.

ఉక్రెయిన్​-రష్యా యుద్ధంపై భారత్​ ఆందోళన

ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై భారత్​ ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే దాడులకు ముగింపు పలకాలని.. చర్చల ద్వారానే విభేదాలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొంది. సోమవారం జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో భారత్ తరపున పాల్గొన్న ​ప్రతినిధి టీఎస్​ తిరుమూర్తి ఈ మేరకు వ్యాఖ్యానించారు. దౌత్య మార్గం ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని భారత ప్రభుత్వం విశ్వసిస్తుందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:మోదీ వరుస భేటీలు.. ఉక్రెయిన్ పొరుగుదేశాలకు కేంద్ర మంత్రులు

Last Updated : Mar 1, 2022, 12:52 PM IST

ABOUT THE AUTHOR

...view details