PM Modi BRICS summit South Africa : బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికాకు బయల్దేరారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన ఆయన.. దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌కు చేరుకోనున్నారు. దక్షిణాఫ్రికా అధ్యక్షతన 15వ బ్రిక్స్ దేశాల సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు సిరిల్ రమఫోసా ఆహ్వానం మేరకు ఆగస్టు 22-24 తేదీల్లో దక్షిణాఫ్రికాలో పర్యటించనున్నారు మోదీ.
బ్రిక్స్ సదస్సుతో పాటు.. బ్రిక్స్-ఆఫ్రికా అవుట్‌రీచ్ కార్యక్రమంలో తాను పాల్గొంటానని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు పర్యటనకు బయల్దేరే ముందు ట్వీట్ చేసిన మోదీ.. గ్లోబల్ సౌత్ ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చిస్తామని చెప్పారు. వైవిధ్యమైన రంగాల్లో సంబంధాల బలోపేతానికి బ్రిక్స్ కృషి చేస్తోందని పేర్కొన్నారు మోదీ. సదస్సుకు హాజరయ్యే నేతల్లోని 'కొంతమంది'తో తాను సమావేశమవుతానని వెల్లడించారు.
"వివిధ రంగాల్లో సహకారం బలోపేతం అయ్యేందుకు అజెండా రూపకల్పనలో బ్రిక్స్ తోడ్పడుతోంది. గ్లోబల్ సౌత్ దేశాల సమస్యలపై చర్చించేందుకు బ్రిక్స్ ఉత్తమ వేదికగా నిలుస్తోంది. జొహన్నెస్‌బర్గ్‌లో నేను బ్రిక్స్ సదస్సుతో పాటు బ్రిక్స్ ఆఫ్రికా అవుట్‌రీచ్ కార్యక్రమంలో పాల్గొంటా. బ్రిక్స్ ప్లస్ చర్చల్లో భాగమవుతా. బ్రిక్స్ సదస్సుకు ఆహ్వానం పొందిన అతిథులతో సంభాషించేందుకు ఎదురుచూస్తున్నా. జొహన్నెస్‌బర్గ్‌కు వచ్చే దేశాధినేతల్లోని కొందరితో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఉన్నా."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి