PM Modi Ayodhya Speech :అయోధ్యలో రామ మందిర నిర్మాణం కల సాకారమైన నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక సందేశం ఇచ్చారు. ఆలయ ప్రారంభోత్సవమైన జనవరి 22న రాత్రి దేశమంతా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంట్లో 'రామ జ్యోతి' వెలిగించి దీపావళి వేడుకలు చేసుకోవాలని సూచించారు. జనవరి 14 నుంచి దేశవ్యాప్తంగా అన్ని తీర్థక్షేత్రాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానితులు మాత్రమే రావాలని మోదీ సూచించారు. జనవరి 23 తర్వాత ప్రజలంతా అయోధ్యకు రావొచ్చని తెలిపారు. అయోధ్యను శుభ్రంగా ఉంచే బాధ్యత అయోధ్య వాసులదే అని ప్రధాని అన్నారు. అయోధ్యధామ్‌లో ఎక్కడా అపరిశుభ్రత కనిపించవద్దని చెప్పారు. ఈ మేరకు అయోధ్యలో జరిగిన సభలో ప్రసంగించారు.
"చారిత్రాత్మక ఘట్టమైన అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠకోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. అభివృద్ధి, సాంస్కృతిక వారసత్వం భారత్‌ను ముందుకు తీసుకెళ్తాయి.ఈ రోజు ఇక్కడ రూ.వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి. ఈ ఆధునిక మౌలిక వసతులు భారత చిత్రపటంపై అయోధ్యను సగర్వంగా నిలుపుతాయి. నేటి సరికొత్త భారత్ తీర్థక్షేత్రాలను సుందరంగా తీర్చిదిద్దుతోంది. వాటికి డిజిటల్ హంగులు అద్దడంలో లీనమై ఉంది. ప్రపంచంలో ఏ దేశమైనా, అవి అభివృద్ధిలో ఎంత ఎత్తుకు ఎదిగినా తమ వారసత్వ సంపదను కాపాడుకోవాలి. ఒకప్పుడు అయోధ్య శ్రీరాముడు టెంట్లో ఉండేవాడు. ఇప్పుడు పక్కా ఇల్లు ఇచ్చాము. కేవలం రాముడికే కాదు దేశంలోని 4 కోట్ల మంది పేద ప్రజలకు కూడా కొత్త ఇళ్లు వచ్చాయి. అయోధ్యను అభివృద్ధి చేయడం ద్వారా ఇక్కడ ప్రజలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి."
--నరేంద్ర మోదీ, భారత ప్రధాని
'వందే భారత్' రైళ్లు, 'నమో భారత్' రైళ్ల తర్వాత ఈ రోజు కొత్త సిరీస్ రైళ్లు వచ్చాయని వాటికి 'అమృత్ భారత్' రైళ్లు అని నామకరణం చేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు. వీటన్నిటి శక్తి భారతీయ రైల్వే అభివృద్ధిలో సహాయపడుతుందన్నారు. ఇక అయోధ్యలో రామమందిరం నిర్మించాక ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుందనే విషయం దృష్టిలో పెట్టుకుని, స్మార్ట్ అయోధ్యగా మార్చడానికి రూ.వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని మోదీ తెలిపారు.