PM Modi At Robot Gallery Gujarat :గుజరాత్‌లోని అహ్మదాబాద్ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైన్స్ సిటీని సందర్శించారు. అక్కడి రోబోలను ఆసక్తిగా తిలకించారు. రోబోటిక్ గ్యాలరీలో ఉన్న డీఆర్డీఓ రోబోలు, మైక్రోబాట్ల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయం, వైద్యం, అంతరిక్షం వంటి వివిధ రంగాల్లో ఉపయోగించే భిన్నమైన రోబోలను మోదీ తిలకించారు. గ్యాలరీలో ఉన్న కేఫ్‌ను సందర్శించిన ప్రధాని.. అక్కడి రోబోలు అందించిన టీని సేవించారు. మోదీ టేబుల్‌పై కూర్చోగా.. ఓ రోబో.. ప్లేట్లో టీ, బిస్కెట్లు తీసుకొని రావడం ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన చిత్రాలను మోదీ ట్విట్టర్లో షేర్ చేశారు. వివిధ రంగాల్లో రోబోలు అనేక మార్పులు తీసుకొస్తున్నాయని మోదీ పేర్కొన్నారు.
"గుజరాత్ సైన్స్ సిటీలోని ఆకట్టుకునే రోబో గ్యాలరీని సందర్శించా. ఇక్కడ ప్రదర్శించిన రోబోల సామర్థ్యం అద్భుతం. ఈ సాంకేతికతలు యువతలో ఆసక్తిని పెంచుతుండటం సంతోషించాల్సిన విషయం. తయారీ, వైద్యం వంటి కీలక రంగాలతో పాటు రోజువారీ జీవితంలో రోబోలు తీసుకొస్తున్న మార్పు మనకు స్పష్టంగా తెలుస్తోంది."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
Vibrant Gujarat Global Summit PM Modi :'వైబ్రంట్ గుజరాత్ పెట్టుబడుల సదస్సు' 20వ వార్షికోత్సవం సందర్భంగా మోదీ అహ్మదాబాద్‌లో పర్యటించారు. రోబో గ్యాలరీని సందర్శించిన అనంతరం 'వైబ్రంట్ గుజరాత్ సదస్సు'లో ప్రసంగించిన మోదీ.. భారత్‌ను ప్రపంచ వృద్ధి ఇంజిన్‌గా మార్చడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. త్వరలోనే భారత్ ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. కొన్నేళ్లలోనే భారత్ ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని పేర్కొన్నారు.