తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లైవ్​: దండి యాత్రకు జెండా ఊపి మోదీ శ్రీకారం

PM Modi at Azadi ka Amrut Mahotsav inauguration in Ahmedabad today
మోదీ

By

Published : Mar 12, 2021, 9:54 AM IST

Updated : Mar 12, 2021, 12:53 PM IST

12:49 March 12

అమృత్​ మహోత్సవ్​ వేడుకల్లో భాగంగా అహ్మదాబాద్​ నుంచి దండికి పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించారు మోదీ.

12:43 March 12

టీకా తయారీలో భారత్​  స్వావలంబన ప్రపంచం మొత్తానికి ప్రయోజనకరమని రుజువైందని మోదీ అన్నారు.  భారత్​ సాధించిన విజయాలు ఈ రోజు మన సొంతం మాత్రమే కాదని, అవి ప్రపంచానికి వెలుగు చూపించబోతున్నాయన్నారు.

12:32 March 12

లోక్​మాన్య తిలక్​ 'పూర్ణ స్వరాజ్'​, ఆజాద్ హింద్ ఫౌజ్ 'దిల్లీ చలో', క్విట్ ఇండియా ఉద్యమాలను దేశం ఎన్నటికీ మరువదని మోదీ అన్నారు. మంగల్​ పాండే, తాత్యా తోపే, రాణి లక్ష్మీ బాయి, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, పండిట్​ నెహ్రూ, సర్దార్ పటేల్​, అంబేడ్కర్​ల నుంచి మనమంతా స్ఫూర్తి పొందుతామని చెప్పారు.

12:19 March 12

స్వాతంత్ర్య పోరాటం, ఆలోచనలు, విజయాలు, చర్యలు, పరిష్కారాలకు 75 ఏళ్లు పూర్తి కావొస్తుందని మోదీ అన్నారు. దేశాన్ని ముందుకు నడిపించేందుకు ఈ ఐదు మూల స్తంభాలు ప్రేరణగా నిలుస్తాయని అమృత్​ మహోత్సవ్​ ప్రారంభోత్సవంలో వ్యాఖ్యానించారు.

12:10 March 12

అమృత్​ మహోత్సవ్​ వెడుకల్లో ఇది తొలి రోజు అని ప్రధాని మోదీ అన్నారు. 2022 ఆగస్టు 15కు 75 వారాల ముందే ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయమని, 2023 ఆగస్టు 15 వరకు కొనసాగుతాయని వెల్లడించారు. కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు.

11:39 March 12

'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్​ వెబ్​సైట్'​ను ప్రధాని మోదీ ప్రారంభించారు. గుజరాత్​లోని అహ్మదాబాద్​లో 75వ స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా దండి యాత్రకు ఆయన శ్రీకారం చుడతారు.

11:33 March 12

అభయ్​ ఘాట్ సమీపంలో సాంస్కృతిక ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ప్రధాని మోదీ ఇక్కడి నుంచే దండియాత్రను జెండా ఊపి ప్రారంభిస్తారు.

11:02 March 12

అహ్మదాబాద్​లోని అభయ్ ఘాట్​ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనలో ఫొటోలు, మేగజిన్లు, ఇతర కలెక్షన్​ను మోదీ వీక్షించారు.

10:58 March 12

సబర్మతీ ఆశ్రమంలోని హృదయ్ కుంజ్​లో మహాత్ముని చిత్రపటానికి పూలమాల వేశారు మోదీ.

10:43 March 12

అహ్మదాబాద్​లోని సబర్మతీ ఆశ్రమంలో మహాత్మునికి నివాళులు అర్పించారు ప్రధాని మోదీ. 75వ స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా దండి యాత్రను ఇక్కడి నుంచే జెండా ఊపి ప్రారంభించనున్నారు.

10:23 March 12

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పాదయాత్ర చేపట్టిన అనేక మంది అహ్మదాబాద్​లోని అభయ్ ఘాట్ చేరుకున్నారు. సబర్మతీ ఆశ్రమం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ.. దండియాత్రను జెండా ఊపి ప్రారంభించనున్నారు.

10:06 March 12

'ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్' ప్రారంభోత్సవానికి ముందు ప్రధాని మోదీ ట్వీట్​ చేశారు. మహాత్ముడు దండి యాత్రను మొదలుపెట్టిన సబర్మతీ ఆశ్రమం నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. ఆత్మనిర్భరత పట్ల భారతీయుల్లో మరింత స్ఫూర్తిని రగిలించడంలో దండియాత్ర కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. 'వోకల్​ ఫర్ లోకల్​' ద్వారా మహాత్మునితో పాటు స్వాతంత్ర్య సమర యోధులకు గొప్ప నివాళి అర్పించినట్లు అవుతుందన్నారు.

ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేసి ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేయాలని మోదీ కోరారు. సబర్మతీ ఆశ్రమంలో ఏర్పాటు చేసే ఛరఖాలో ఆత్మనిర్భరతకు సంబంధించిన ట్వీట్లను జోడించనున్నట్లు చెప్పారు. ఇది ప్రజల ఉద్యమానికి హేతువుగా నిలుస్తుందన్నారు.

08:37 March 12

లైవ్​: ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​

బ్రిటిష్‌ పాలన నుంచి దేశానికి స్వాతంత్య్రం లభించి 2022 ఏడాదితో 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న వేళ.. అంబరాన్నంటే వేడుకలకు యావద్దేశం సిద్ధమైంది. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' పేరిట 75 వసంతాల స్వాతంత్య్ర సంబరాలకు సమాయత్తమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్​లో ఈ వేడుకలను ప్రారంభించనున్నారు. దండి యాత్ర 91వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పాదయాత్ర కార్యక్రమానికి ప్రధాని శ్రీకారం చుట్టనున్నారు.

శుక్రవారం ఉదయం సబర్మతి ఆశ్రమం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర.. 241 మైళ్ల దూరంలోని దండి వరకు సాగనుంది. 25 రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది. ఏప్రిల్ 5న దండిలో యాత్ర ముగుస్తుంది. దేశ ప్రజలను ఏకం చేసిన మహాత్ముడి స్ఫూర్తితో ఈ పాదయాత్ర జరగనున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రధాని మోదీ.. పాదయాత్రను ప్రారంభించిన తర్వాత మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆయా రాష్ట్రాల్లో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఈ ప్రదర్శనల్లో దండి యాత్ర, మహాత్మ గాంధీ, నేతాజీ, సర్దార్ పటేల్ సహా ఉద్యమ నాయకుల త్యాగాలను ప్రతిబింబించే కార్యక్రమాలు ఉంటాయని కేంద్ర సమాచార, ప్రసార శాఖ తెలిపింది.

అప్పటి యాత్రను తలపించేలా

ఉప్పు తయారీపై పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తూ జాతిపిత మహాత్మా గాంధీ 1930 మార్చి 12న దండి యాత్ర ప్రారంభించారు. 81 మంది వ్యక్తులతో సబర్మతి నుంచి దండి వరకు కాలినడకన ప్రయాణించారు. ఏప్రిల్ 5న ఈ యాత్ర ముగిసింది. ఇదే స్పూర్తితో.. మోదీ ప్రారంభించే యాత్ర 24 రోజుల పాటు కొనసాగనుంది. 81 మంది యాత్రికులు అహ్మదాబాద్ నుంచి నవ్సారీ జిల్లాలోని దండి గ్రామం వరకు ప్రయాణించనున్నారు. బైక్ రైడర్లు సైతం ఈ యాత్రలో పాల్గొననున్నారు. 75 కి.మీ వరకు యాత్రకు తాను నేతృత్వం వహిస్తానని కేంద్రమంత్రి ప్రహ్లద్ సింగ్ పటేల్ తెలిపారు. అమృత్ మహోత్సవాలు దేశవ్యాప్తంగా జరగనున్నట్లు తెలిపారు. 75 వారాల పాటు ఈ ఉత్సవాలు కొనసాగుతాయని చెప్పారు. వచ్చే ఏడాది ఆగస్టు 15 వరకు ప్రతి వారం కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు.

విభిన్న రూపాల్లో

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలు దేశవ్యాప్తంగా 2022 స్వాతంత్ర్య దినోత్సవం వరకు విభిన్న రూపాల్లో జరగనున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో 75 ఏళ్ల స్వాతంత్ర్యాన్ని పురస్కరించుకుని ప్రదర్శనలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలు, వర్చువల్‌ సమావేశాలు జరగనున్నాయి. స్వాతంత్ర్య సమరయోధులు, అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు ఊరురా నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ ఉత్సవాలపై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ వర్చువల్‌గా సమావేశం అయ్యారు. 75 ఏళ్ల స్వాతంత్ర్యాన్ని పురస్కరించుకుని 259 మంది ప్రముఖులతో ప్రధాని ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ప్రజలందరీ భాగస్వామ్యంతో ఈ వేడుకలు ముందుకు సాగాలని ప్రధాని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరు స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని కలిగి ఉండాలని సూచించారు.

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలను ఐదు రకాలుగా విభజించారు. 75 ఏళ్లలో భారత్ ఆలోచనలు, సాధించిన విజయాలు, తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాలు, పరిష్కరించిన సమస్యలపై పలు రూపాల్లో 75 వారాల పాటు చర్చించనున్నారు.సనాతన భారత్‌ నుంచి ఆధునిక భారత్‌గా ఆవిర్భవించిన తీరును విశ్లేషించనున్నారు. శాస్త్రవేత్తల విజయాలను కీర్తించనున్నారు. ఈ వేడుకల్లో స్వాతంత్ర్యపు ఉద్యమంలో వెలుగు చూడని వీరుల గాధలు, మహిళా స్వాతంత్ర్య సమరయోధులు, ఈశాన్య భారత పోరాటాలు, ఎర్రకోటలో భారత జాతీయ ఆర్మీ రైలు, స్వాతంత్ర్య ఉద్యమంలో పత్రికల పాత్ర వంటి అంశాలపై ప్రచురణలను అందుబాటులోకి తీసుకు రానున్నట్లు కేంద్రం తెలిపింది.

Last Updated : Mar 12, 2021, 12:53 PM IST

ABOUT THE AUTHOR

...view details