Modi BIMSTEC summit: ఐరోపాలో ఇటీవలి పరిణామాలు అంతర్జాతీయ శాంతి భద్రతలపై ప్రశ్నలు లేవనెత్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రాంతీయ సహకారానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడిందని చెప్పారు. బిమ్స్టెక్ ఐదవ శిఖరాగ్ర సదస్సులో మాట్లాడిన మోదీ.. ఈ సంస్థ అభివృద్ధి కోసం సరికొత్త చార్టర్‌ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. సభ్య దేశాల మధ్య అత్యున్నత సహకారం అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. బంగాళాఖాతాన్ని అనుసంధానతకు, శ్రేయస్సుకు, భద్రతకు వారధిగా మార్చాల్సిన తరుణం ఆసన్నమైందని ఉద్ఘాటించారు.
MODI NEWS:బిమ్స్టెక్ సెక్రెటేరియట్ కోసం భారత్ ఒక మిలియన్ డాలర్లు అందించనుందని మోదీ ప్రకటించారు. 'ఐరోపాలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయ సుస్థిరతపై అనేక ప్రశ్నలకు దారితీస్తున్నాయి. కాబట్టి, బిమ్స్టెక్ సామర్థ్యాన్ని పెంపొందించాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ కూటమిని మరింత క్రియాశీలంగా మార్చాలి. ఆపరేషనల్ బడ్జెట్ పెంచేందుకు తాము ఇచ్చే నిధులు ఉపయోగపడతాయి. ఇందుకోసం బిమ్స్టెక్ సెక్రెటరీ జనరల్ రోడ్‌మ్యాప్ సిద్ధం చేయాలి. బంగాళాఖాతాన్ని అనుసంధాన వారధిగా మార్చే సమయం వచ్చేసింది. బిమ్స్టెక్ దేశాలన్నీ ఇందుకోసం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిస్తున్నా. 1997లో మాదిరిగానే మనం మన లక్ష్యాలను నూతన ఉత్సాహంతో సాధించాలి. ఈ సదస్సు ఫలితాలు.. బిమ్స్టెక్ చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖిస్తాయి' అని మోదీ పేర్కొన్నారు.